E-Passports: తెలంగాణలో ఇకపై ఈ-చిప్ ఎనేబుల్డ్ పాస్‌పోర్టులు.. ఎలా అప్లై చేయాలంటే?

E-Passports: తెలంగాణలో ఇకపై ఈ-చిప్ ఎనేబుల్డ్ పాస్‌పోర్టులు.. ఎలా అప్లై చేయాలంటే?


తెలంగాణలో కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఇకపై ‘ఈ-చిప్ ఎనేబుల్డ్’ పాస్‌పోర్టులు జారీ కానున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా పాస్‌పోర్టులలో అధునాతన సేఫ్టీ ఫీచర్లను అందించడానికి కేంద్ర విదేశాంగ శాఖ ముందడుగు వేసింది. విదేశాంగ శాఖ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఈ-పాస్‌పోర్టులను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి జె. స్నేహజా తెలిపారు. హైదరాబాద్ పాస్ పోర్టు ఆఫీస్ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉందన్నారు. ఈ-చిప్ టెక్నాలజీ ద్వారా తెలంగాణ పౌరులకు జారీ చేసే ప్రతి పాస్‌పోర్టులో మెరుగైన భద్రతా సౌకర్యాలను అందిస్తాం” అని తెలిపారు.

ఈ-పాస్‌పోర్టు అంటే ఏమిటి?

ఈ-పాస్‌పోర్టు అనేది ఎలక్ట్రానిక్ మైక్రోప్రాసెసర్ చిప్‌తో కూడిన పాస్‌పోర్టు. ఇందులో పాస్‌పోర్టు హోల్డర్ కి సంబంధించిన బయోమెట్రిక్, పర్సనల్ డేటా ఉంటుంది. ఈ చిప్-ఆధారిత పాస్‌పోర్టు అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. నకిలీ పాస్‌పోర్ట్ లేదా అసలు పాస్‌పోర్ట్‌పై ఫొటోను మార్చడానికి ఆస్కారం లేకుండా చేస్తుంది. తద్వారా నేరగాళ్లు నకిలీ పాస్‌పోర్టుల ద్వారా దేశాలు దాటేందుకు ఆస్కారం ఉండదు. “ప్రస్తుతం ఉన్న ‘మెషిన్ రీడబుల్ పాస్‌పోర్టులు’ ఉపయోగిస్తున్నవారు వాటి చెల్లుబాటు కాలం పూర్తయ్యే వరకు ఉపయోగించవచ్చు. వారి పాస్‌పోర్టు చెల్లుబాటు ముగిసిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే.. వెరిఫికేషన్ తదితర ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ-చిప్ పాస్‌పోర్టులను పొందవచ్చు” అని RPO స్పష్టం చేశారు. ఈ-చిప్ పాస్‌పోర్టు చెల్లుబాటు పెద్దలకు 10 సంవత్సరాలు, చిన్నారులకు 5 సంవత్సరాలుగా నిర్ణయించారు.

హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు ఆఫీస్ సేవలు

హైదరాబాద్ ఆర్పీవో సాధారణ పాస్‌పోర్టుల కోసం 1 నుండి 10 పని దినాల్లో, తత్కాల్ సేవల కోసం 1 నుండి 5 పని దినాల్లో అపాయింట్‌మెంట్ సైకిల్‌ను మెరుగుపరిచింది. 2024లో సుమారు 9.02 లక్షల దరఖాస్తులను ఈ ఆఫీస్ ప్రాసెస్ చేసింది. ఇందులో పాస్‌పోర్టు జారీ, పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు, ఇతర సంబంధిత సేవలు ఉన్నాయి. రోజుకు సగటున 4,200 దరఖాస్తులను హ్యాండిల్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకిలో మూడు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, నిజామాబాద్, కరీంనగర్‌లో ఒక్కొక్కటి, అదేవిధంగా 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి.

ఈ-పాస్‌పోర్టు ప్రధాన లక్షణాలు:

పాస్‌పోర్టు ముందు కవర్‌పై బంగారు రంగు ఎంబెడెడ్ చిప్ ఉంటుంది.
వేలిముద్రలు, ఫోటో, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలు అందులో స్టోర్ అయి ఉంటాయి.
పాస్‌పోర్టు హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్టు నంబర్ వంటి డెమోగ్రాఫిక్ డేటా ఉంటుంది.
కాంటాక్ట్‌లెస్ చిప్‌తో ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు
నకిలీ పాస్‌పోర్టులు, మారు వ్యక్తులు తప్పుడు విధానాల్లో వినియోగించేందుకు ఆస్కారం లేకుండా ప్రత్యేక పదార్థంతో తయారైన పేజీలు ఇందులో ఉంటాయి.
జారీ చేసిన అధికారి డిజిటల్ సంతకం ఉంటుంది

ఈ-చిప్ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసే విధానం:

1. పాస్‌పోర్టు సేవా పోర్టల్‌ను సందర్శించండి: www.passportindia.gov.in
2. రిజిస్టర్/లాగిన్ చేసి, దరఖాస్తు ఫారమ్‌ను నింపండి
3. మీ PSK లేదా POPSKని ఎంచుకోండి
4. రుసుము చెల్లించండి: సాధారణ పాస్‌పోర్టు కోసం 36 పేజీల బుక్‌లెట్‌కు రూ. 1,500, తత్కాల్ కోసం రూ. 3,500
5. అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయండి
6. బయోమెట్రిక్ డేటా సేకరణ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం PSK/POPSKని సందర్శించండి

ఈ కొత్త ఈ-చిప్ పాస్‌పోర్టులతో పాస్‌పోర్టు సేవలలో భద్రత, సామర్థ్యం మరింత పెరుగుతుందని RPO ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *