DRDO: డ్రోన్ నుంచి మిస్సైళ్లు.. యుద్ధ ట్యాంకులు సైతం ధ్వంసం.. DRDO మరో ఘనత..

DRDO: డ్రోన్ నుంచి మిస్సైళ్లు.. యుద్ధ ట్యాంకులు సైతం ధ్వంసం.. DRDO మరో ఘనత..


భారత రక్షణ రంగం ఓవైపు ప్రపంచంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు మరోవైపు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటోంది. ఈ క్రమంలో భారత రక్షణ సామర్థ్యాలకు బలమైన ఊతమిచ్చే దిశగా, డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్(NOAR)లో డ్రోన్ (UAV) ద్వారా లాంచ్ చేయదగిన ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ (ULPGM-V3) పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ విజయం భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతల అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది.

ఈ విజయం గురించి డీఆర్డీవోతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో ప్రకటించారు. ‘‘భారత రక్షణ సామర్థ్యాలకు గణనీయమైన బలాన్ని చేకూర్చే ఈ విజయం కోసం డీఆర్డీవోను, అలాగే దీని అభివృద్ధి-ఉత్పత్తిలో భాగస్వాములైన DcPPs, MSMEs, ఇతర స్టార్టప్‌లను అభినందిస్తున్నాను. భారత పరిశ్రమలు కీలక రక్షణ సాంకేతికతలను గ్రహించి, ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ విజయం నిరూపించింది” అని ఆయన అన్నారు.

ULPGM-V3 మిస్సైల్ ప్రత్యేకతలు

ULPGM-V3 అనేది DRDO గతంలో అభివృద్ధి చేసి, అందించిన ULPGM-V2 మిస్సైల్‌కి మెరుగైన వెర్షన్. దీని ప్రత్యేకత ఏంటంటే.. వీటిని డ్రోన్‌ల నుంచి కూడా ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉంటుంది. సాధారణంగా మిస్సైళ్లను ప్రయోగించాలంటే గాల్లో అయితే యుద్ధ విమానాలు, యుద్ధ హెలీకాప్టర్లు, భూమ్మీద నుంచి మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్స్, వాహనాలను వినియోగించాల్సి ఉంటుంది. కానీ రాడార్ కంటికి చిక్కకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్ల ద్వారా మిస్సైల్‌ను ప్రయోగించడం రక్షణ రంగంలో సరికొత్త సంచలనంగా పేర్కొనవచ్చు. తద్వారా ఇది ఆధునిక యుద్ధ వ్యూహాలలో అత్యంత కీలకమైన ఆయుధంగా మారనుంది. ఈ మిస్సైల్‌లో ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ (IIR) సీకర్‌లు, డ్యూయల్-థ్రస్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లు వంటి అధునాతన ఫీచర్‌లు ఉన్నాయి. ఇవి పగటి సమయంలో మాత్రమే కాదు, రాత్రి సమయంలో జరిగే సైనిక ఆపరేషన్‌లలోనూ సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఈ మిస్సైల్‌ను ULM-ER (ఎక్స్‌టెండెడ్ రేంజ్) అని కూడా పిలుస్తారు. ఇది 12.5 కేజీల బరువు కలిగి ఉంటుంది. లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత కచ్చితత్వంతో ఆ లక్ష్యాన్ని చేధించి ధ్వంసం చేయగలదు. అంటే ఫైర్-అండ్-ఫర్గెట్ సామర్థ్యంతో దీన్ని రూపొందించారు. ఇది పగటి సమయంలో 4 కి.మీ, రాత్రి సమయంలో 2.5 కి.మీ గరిష్ఠ రేంజ్‌ను కలిగి ఉంది. భూమ్మీద స్థిరంగా ఉన్న భవనాలు, మిలటరీ స్థావరాలు వంటి వాటినే కాదు, కదులుతూ ఉండే వాహనాలు, ఇతర కదిలే లక్ష్యాలను కూడా ఖచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో ట్యాండమ్ వార్‌హెడ్ ఉండటం వల్ల ఎక్స్‌ప్లోసివ్ రియాక్టివ్ ఆర్మర్ (ERA)తో కూడిన యుద్ధ ట్యాంకులను కూడా ధ్వంసం చేయగలదు.

స్వదేశీ సాంకేతికతలో మరో ముందడుగు

ULPGM-V3 పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసిన మిస్సైల్. దీని గైడెన్స్ సిస్టమ్‌లు, ప్రొపల్షన్, వార్‌హెడ్ మెకానిజమ్‌లు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌లో అదానీ గ్రూప్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ప్రధాన తయారీ భాగస్వాములుగా ఉన్నాయి. అయితే DRDO దీని అభివృద్ధితో పాటు పరీక్షల బాధ్యతను నిర్వహిస్తోంది. ఈ మిస్సైల్‌ను TAPAS-BH, ఆర్చర్-ఎన్జీ వంటి డ్రోన్‌ల నుంచి ప్రయోగించేలా తయారు చేశారు. ఇది యుద్ధ రంగంలో తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన ఫైర్-అండ్-ఫర్గెట్ ఆయుధంగా మారనుంది.

NOAR: అధునాతన రక్షణ పరీక్షల కేంద్రం

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలంలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) డీఆర్‌డీఓ తయారు చేసే అధునాతన సాంకేతికతలను పరీక్షించడానికి ఒక కీలక కేంద్రంగా ఉపయోగపడుతోంది. ఇటీవల ఈ రేంజ్‌లో హై-ఎనర్జీ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ (DEWs) పరీక్షలు కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇవి ఫిక్స్‌డ్-వింగ్ UAVలు, డ్రోన్ స్వార్మ్‌లను ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. DRDO స్వదేశీ పరిశ్రమలతో కలిసి పనిచేస్తూ, సాంకేతికతలను బదిలీ చేస్తూ, MSMEలు, ఇతర స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. గత ఐదేళ్లలో 130 కంటే ఎక్కువ పరిశ్రమలతో డీఆర్‌డీఓ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ఫలితంగా స్వదేశీ రక్షణ ఉత్పత్తి వ్యవస్థ బలోపేతమైంది.

ULPGM-V3 పరీక్షలు విజయవంతం కావడం భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధి, ఉత్పత్తిలో ఒక కీలక అడుగుగా నిలిచింది. ఈ మిస్సైల్ ఆధునిక యుద్ధ రంగంలో ఖచ్చితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధ వ్యవస్థగా భారత సైన్యానికి మరింత శక్తిని చేకూరుస్తుంది. ఈ విజయం భారత రక్షణ పరిశ్రమల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *