Trump Tariffs: సుంకాల వల్ల ఇప్పటికే నష్టాలు కనిపిస్తుంటే, ట్రంప్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు. స్టాక్‌మార్కెట్ల పతనాన్ని ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా ఈ సుంకాలను- రోగానికి మందు అనే అర్థం వచ్చేలా అభివర్ణిస్తున్నారు. ప్రతీకార సుంకాల విషయంలో తమ ప్రభుత్వ నిర్ణయం సముచితమే అని ప్రజలు గ్రహిస్తారంటూ ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. సుంకాలు చాలా మంచివని ట్రంప్ చెప్పుకున్నారు. ముఖ్యంగా చైనా, యూరోపియన్ యూనియన్‌తో తమకు వాణిజ్య లోటు భారీగా ఉందనీ, ఈ సమస్యకు ఇప్పటి సుంకాలు పరిష్కారం చూపుతాయని ట్రంప్ ఈ పోస్టులో వివరించారు.
ట్రంప్ సుంకాల నిర్ణయాలతో అమెరికా స్టాక్‌మార్కెట్లు దారుణంగా నష్టపోయాయి. ఈ తెల్లవారుజామున మొదలైన ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్, చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా ఇలా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. మరి, మన స్టాక్‌మార్కెట్ల పరిస్థితి ఏంటి? భారీగా నష్టాలు మూటకట్టుకోవడానికి మన ఇన్వెస్టర్లు రెడీగా ఉండాలా? ట్రంప్ పేరుతో లాస్ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలా? ట్రంప్ ఇస్తున్న షాక్స్ ఎలా ఉన్నాయో మరో గంటసేపట్లో తేలిపోతుంది.
ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లలో కల్లోలం కనిపిస్తోంది. ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కనిపిస్తున్నాయి. జపాన్ నిక్కీ 8 శాతం, కొరియా కోస్పి సూచీ 5 శాతం డౌన్ అయ్యాయి. అలాగే ఆస్ట్రేలియా స్టాక్‌మార్కెట్ 6 శాతం పడిపోయింది. హాంకాంగ్ స్టాక్‌మార్కెట్లు 9 శాతం పతనం అయ్యాయి. అయితే స్టాక్‌మార్కెట్ల ఈ మహా పతనాన్ని ట్రంప్ ఏమాత్రం లెక్కచేయడం లేదు.
ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు..అమెరికన్లు. అధ్యక్షుడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతోందంటూ లక్షల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. డోనాల్డ్ ట్రంప్‌తో పాటు, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను మరింత ముంచేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూఎస్ జనం. ట్రంప్ నిర్ణయం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. చైనా మార్కెట్ 10 శాతం తగ్గగా, హాంకాంగ్ మార్కెట్ 10 శాతానికి పైగా పడిపోయింది. అమెరికన్ స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్ పై నిఘా ఉంచే నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్ మరింత 15-20% క్షీణతను చూడవచ్చు. నిపుణుల ఈ అంచనా తర్వాత, ప్రజలలో ఉద్రిక్తత పెరిగింది.
అమెరికా భారత ఉత్పత్తులపై 26%, ఇతర దేశాలపై 10% దిగుమతి సుంకాన్ని విధించింది. చైనా 34% సుంకం విధించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోగా, కెనడా అమెరికన్ వాహనాలపై 25% సుంకం విధించింది. దీని కారణంగా ప్రజలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై కొత్తగా 10% సుంకం విధించడం, డజన్ల కొద్దీ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించడం పట్ల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే మార్కెట్ నుండి భారీ మొత్తంలో డబ్బు ఉపసంహరించబడుతోంది. దీని కారణంగా భారీ క్షీణత కనిపిస్తోంది. ట్రంప్ సుంకాల నిర్ణయం ప్రపంచ మార్కెట్లలో ద్రవ్యోల్బణం భయాలను పెంచింది. దీని కారణంగా మాంద్యం ముప్పు తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. సుంకాలు దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి