అందానికి శనగపిండిని చాలా ప్రత్యేకంగా వాడతారు. ఇది సహజంగా ముఖంపై ఉన్న మురికిని తొలగించే గుణాన్ని కలిగి ఉంటుంది. శనగపిండిని ముఖంపై స్క్రబ్ లా వాడితే చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం తాజాగా స్వచ్ఛంగా కనిపిస్తుంది. అంతే కాదు ఇది ముఖంపై ఉండే నల్ల మచ్చలు, జిడ్డును పోగొట్టడంలో కూడా సహాయపడుతుంది.
పెసరపిండి చర్మాన్ని నెమ్మదిగా స్క్రబ్ చేసే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ పిండితో ముఖాన్ని మర్దన చేస్తే చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఇది మృత కణాలను సులభంగా తొలగించి మొటిమల వల్ల కలిగే ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
వరి పిండిలో ఉండే చిన్న చిన్న కణాలు ముఖంపై నెమ్మదిగా రుద్దితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది మంచి స్క్రబ్ లా పనిచేస్తూ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది.
సున్నితమైన చర్మం ఉన్నవారికి ఓట్స్ పిండి అత్యుత్తమ ఎంపిక. ఇందులో ఉండే సహజమైన తేమ లక్షణాలు చర్మాన్ని పొడిబారకుండా ఉంచుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో ఇది చర్మంపై ఉండే ఎరుపుదనం, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బాదం పిండిలో విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది. ఈ పిండిని ఫేస్ స్క్రబ్ గా వాడితే చర్మానికి మంచి పోషణ లభిస్తుంది. అంతేకాదు మెరిసే మృదుత్వం కూడా వస్తుంది. ఇది ముడతలను తగ్గించడానికి కూడా ఒక సహజ పరిష్కారంగా పని చేస్తుంది.
కందిపప్పుతో తయారు చేసిన పిండిని స్క్రబ్ గా వాడితే ముఖంపై ఉన్న మృత కణాలు సులభంగా తొలగిపోతాయి. ఈ స్క్రబ్ వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది సహజంగా చర్మం పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది.
గోధుమ పిండి కాస్త గరుకుగా ఉండటం వల్ల ఇది స్క్రబ్ కు మంచి ఎంపిక. ఇది చర్మానికి మృదుత్వం ఇవ్వడమే కాకుండా.. ట్యాన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో స్క్రబ్ చేసినప్పుడు ముఖం స్వచ్ఛంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
మినపపప్పు, శనగపప్పు, పెసరపప్పులను నానబెట్టి బాగా గ్రైండ్ చేసి పిండిగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్క్రబ్ లా వాడితే చర్మం తేలికగా శుభ్రం అవుతుంది. చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. ఇది ఒక సంపూర్ణ స్క్రబ్ గా పని చేస్తుంది.
మొక్కజొన్న పిండి కూడా చర్మ సంరక్షణలో ఉపయోగపడుతుంది. ఇది స్క్రబ్ గా వాడితే చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. ఇది చర్మంపై ఉండే కాలుష్య మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.
ఇవి ఇంట్లోనే సులభంగా లభించే పదార్థాలు కావడం విశేషం. ఎలాంటి రసాయనాల అవసరం లేకుండా ఇంటి దగ్గరే ఈ సహజ పదార్థాలతో ఫేస్ స్క్రబ్ లు తయారు చేసుకోవడం ద్వారా మీరు మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే వాడాలి)