Divya Deshmukh :19 ఏళ్ల యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన ఫైనల్‌లో ఆమె దిగ్గజ క్రీడాకారిణి కోనేరు హంపిపై ట్రై బ్రేకర్‌లో అద్భుత విజయం సాధించి, భారతదేశానికి చెందిన 88వ గ్రాండ్ మాస్టర్‌గా అవతరించింది. ప్రపంచకప్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి మధ్య ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ట్రై బ్రేకర్‌లో మొదటి ర్యాపిడ్ గేమ్ డ్రాగా ముగియగా, రెండవ గేమ్‌లో దివ్య గెలిపొందింది. మొత్తం 75 ఎత్తులలో జరిగిన ఈ గేమ్‌లో కోనేరు హంపి సమయం ఒత్తిడికి గురవడం దివ్యకు కలిసివచ్చింది. విజయం సాధించిన వెంటనే దివ్య సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె తన తల్లిని కౌగిలించుకున్న భావోద్వేగ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2025 ఫిడే మహిళల ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా దివ్య నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దివ్యకు 1.5 పాయింట్లు లభించగా, కోనేరు హంపికి 0.5 పాయింట్లు వచ్చాయి. ఆదివారం నాటి మ్యాచ్‌లో హంపి గట్టి పోటీనివ్వడంతో ఫలితం ట్రై బ్రేకర్‌కు దారితీసింది. సోమవారం దూకుడుగా ఆడిన దివ్య టోర్నీ విజేతగా నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకుంది.
నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ సీనియర్ విభాగంలో చాలా తక్కువ టోర్నీలు మాత్రమే ఆడింది. కోనేరు హంపితో పోల్చుకుంటే దివ్య అనుభవం చాలా తక్కువ. ఈ టోర్నీకి ముందు ఆమెకు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా లేదు. 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను పొందిన దివ్య, 2023లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. అలాగే ఒలింపియాడ్‌లో మూడు స్వర్ణ పతకాలను కూడా అందుకుంది. ఈ ప్రపంచకప్‌లో తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ద్రోణవల్లి హారిక, జు వెన్జున్ వంటి ప్రతిభావంతులను ఓడించి అందర్నీ ఆకట్టుకుంది. డిసెంబర్ 2024లో కోనేరు హంపి తన కెరీర్‌లో రెండవసారి వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచింది. కాబట్టి, ఫైనల్‌లోకి వచ్చేసరికి దివ్య దేశ్‌ముఖ్ అండర్‌డాగ్‌గా పరిగణించబడింది. హంపి ప్రపంచంలో నంబర్ 5 ర్యాంక్‌లో ఉండగా, దివ్య నంబర్ 18 ర్యాంక్‌లో ఉంది. ఈ 19 ఏళ్ల క్రీడాకారిణి గత సంవత్సరం బాలికల విభాగంలో ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌గా నిలిచింది. అంతేకాకుండా, ఆమె 2026లో జరగనున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు కూడా అర్హత సాధించింది.
19-year-old Divya Deshmukh is in tears after winning the 2025 FIDE Women’s World Cup! pic.twitter.com/DuFYH0bqT5
— chess24 (@chess24com) July 28, 2025
Divya’s hug to her mom says everything ❤️#FIDEWorldCup @DivyaDeshmukh05 pic.twitter.com/jeOa6CjNc1
— International Chess Federation (@FIDE_chess) July 28, 2025
తన విజయంపై దివ్య దేశ్‌ముఖ్ భావోద్వేగంతో స్పందిస్తూ, ఐఏఎన్ఎస్ ను ఉటంకిస్తూ ఇలా అంది: “ఇది విధి. టోర్నమెంట్‌కు ముందు, నేను ఇక్కడ గ్రాండ్‌మాస్టర్ నార్మ్ సంపాదించవచ్చని అనుకున్నాను. చివరకు, నేను గ్రాండ్‌మాస్టర్‌గా మారాను.” నాగ్‌పూర్‌లో జన్మించిన ఈ టీనేజ్ క్రీడాకారిణి 2024లో బుడాపెస్ట్, హంగరీలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారతదేశం స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన నాలుగో భారత మహిళ దివ్య, మరియు టైటిల్ కోసం ఇద్దరు భారతీయులు పోటీ పడటం ఇదే మొదటిసారి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..