
కట్టుకున్న భర్తను కడతేర్చడాలు.. ప్రియుని మోజులోపడి పసుపుకుంకాలు తెంపేసుకోవడాలు.. సుపారీ ఇచ్చి సుతారంగా చేతులకు మట్టి అంటకుండా మట్టిపెట్టడాలు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. కడవరకు కలిసి జీవిస్తామని అగ్నిసాక్షిగా మూడుముళ్లు వేయించుకున్న భార్యలే భర్తలను పొట్టనపెట్టుకుంటన్నారు. ఇలాంటి ఘటనలు రోజుకు ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో భర్తను భార్య చంపిన మరో ఘటన వెలుగు చూసింది. వర్ధన్నపేట మండలం భవానీకుంట తండాలో ఈ దారుణం జరిగింది.
బాలాజీ, కాంతిలు భార్యా భర్తలు. ఈనెల 8వ తేదీన దాటుడు పండుగ సందర్భంగా భర్త బాలాజీ హత్యకు భార్య కాంతి స్కెచ్ వేసింది. పండగ సందర్భంగా చేసుకునే వేడుకల్లో థమ్స్‌అప్ కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి భర్తకు ఇచ్చింది కాంతి. భార్య ఇచ్చిన కూల్‌డ్రింక్‌ను లిక్కర్ లో కలుపుకొని తాగాడు భర్త. తాగిన కొద్దిసేపటి గొంతులో మంటరావడంతో ఏదో తేడా జరిగిందని అనుమానించాడు. దీంతో అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలాజీ మరణించాడు.
అయితే భర్త చనిపోతాడని భావించిన భార్య కాంతి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. మృతుని తండ్రి హరిచంద్ ఫిర్యాదుమేరకు వర్దన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త మరణానికి కారణమైన భార్యపై కేసు నమోదు చేశారు.