కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా పిలువబడే చాణక్యుడు గొప్ప గురువు మాత్రమే కాదు.. రాజకీయ వేత్త, దౌత్య వేత్త, జీవిత తత్వశాస్త్రంలో నిపుణుడు కూడా. జీవితానికి సరైన దిశానిర్దేశం చేసే లోతైన అవగాహనను ఆయన విధానాలు కలిగి ఉన్నాయి. నేటి వేగవంతమైన, పోటీ ప్రపంచంలో విజయం సాధించడం అంత సులభం కాదు. అయితే ఇటువంటి సమయంలో కూడా చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పిన కొన్ని సూత్రాలను నేటి యువత కూడా అనుసరిస్తే ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని నిరూపించబడ్డాయి. జీవితంలో గొప్పగా ఎదగాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని చాణక్య సలహా ఇచ్చారు. ఎవరైనా సరే ఆ అలవాట్లను సకాలంలో గుర్తించి సరిదిద్దుకుంటే.. విజయం సాధించడమే కాదు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కూడా సొంతం చేసుకుంటారు.
అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించే అలవాటున్నవారు
చాణక్యుడి ప్రకారం.. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించే వ్యక్తి ఎప్పుడూ తన లక్ష్యాన్ని చేరుకోలేడు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తూ.. ఆ అభిప్రాయాల వలలో చిక్కుకుంటారు. దీంతో తమ సొంత ఆలోచనలను కోల్పోతారు. ప్రతి ఒక్కరి ఇష్టాయిష్టాలను దృష్టిలో ఉంచుకోవడం వల్ల వీరి ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. అంతేకాదు ఇతరులను సంతోష పెట్టేందుకు తమకు ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా పనులు చేస్తూ తమని తాము కోల్పోతారు. అయితే మీకంటూ సొంతం జీవితం కావాలంటే.. ఇతరులు సంతోషంగా ఉన్నా లేకపోయినా.. ఎప్పుడూ సరైన , అవసరమైన పని చేయండి అని చాణక్య చెప్పారు. అంతేకాదు విజయం సాధించడానికి స్పష్టమైన ఆలోచన, దృఢమైన నిర్ణయం అవసరమని తెలిపారు.
అనవసరమైన విషయాలపై, విమర్శలపై శ్రద్ధ చూపించేవారు
మీపై ఇతరులు చేసే విమర్శలను వినడం.. వాటికి మనసులో ప్రాధాన్యత ఇవ్వడం వలన మీ మనస్సు బలహీనంగా మారుతుంది. ప్రతి ఒక్కరినీ విమర్శించడం ప్రజలకు అలవాటు అని.. అయితే ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా.. తన లక్ష్యంపై దృష్టి పెట్టేవాడు మాత్రమే గొప్ప వ్యక్తి అవుతాడని చాణక్యుడు చెప్పాడు. కారణం లేకుండా విమర్శించే వారికి సమాధానం చెబుతూ సమయం వృధా చేయకండి. మీ సమయం, శక్తిని మీ పని .. లక్ష్యాలపై మాత్రమే కేంద్రీకరించమని చాణక్య చెప్పారు. అంతేకాదు సమాజంలో తనకంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని చేరుకున్న వ్యక్తి వైపు ఎక్కువ వేళ్లు చూపిస్తారు అని పేర్కొన్నాడు. కనుక జీవితంలో సక్సెస్ కావాలంటే అనవసరమైన విషయాలపై, విమర్శలపై శ్రద్ధ చూపించ వద్దు అని సూచించాడు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు