కావేరి కాలింగ్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం సద్గురు చేపట్టిన ఓ విప్లవాత్మక పర్యావరణ పునరుద్దరణ కార్యక్రమం. ట్రిలియన్ ట్రీస్: ఇండియా ఛాలెంజ్ ద్వారా టాప్ ఇన్నోవేటర్‌గా పేరుపొందిన ఈ ఉద్యమం.. 8.4 కోట్ల మందికి జీవనాధారమైన కావేరి నదిని పునరుజ్జీవింపజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ప్రైవేట్ వ్యవసాయ భూముల్లో 242 కోట్ల మొక్కలను నాటడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. ఇది చెట్ల ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ మొక్కల పెంపకం కార్యక్రమం నేలను సారవంతం చేయడానికి, నీటి నిలుపుదలని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కావేరి కాలింగ్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా రైతులు తమ పొలాల గట్లలో, నదులు, కాలువల తీరాల వెంట మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. తద్వారా కావేరీ నది ఏడాది పొడవునా గలగలా పారేందుకు దోహదపడుతుంది.
కావేరి కాలింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సేవ్ సాయిల్ ఉద్యమ ప్రతినిధి ఆనంద్ ఎథిరాజలు మాట్లాడుతూ.. నేల పునరుత్పత్తి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. UNFCCC-COP29 శిఖరాగ్ర సమావేశం, UNCCD- COP16 సందర్భంగా మేము ప్రచారం చేస్తున్న ముఖ్య అంశాలలో ఇది ఒకటి అని అన్నారు. ప్రపంచ వాతావరణ ఆర్థిక సహాయంలో 4 శాతం కంటే తక్కువ వ్యవసాయం,ఆహార వ్యవస్థలకు చేరుతోందని ఆయన అన్నారు. వాతావరణ మార్పును వాతావరణంలో పరిష్కరించలేం. ఈ సమస్యను నేల ద్వార మాత్రమే పరిష్కరించవచ్చు. చెట్ల ఆధారిత వ్యవసాయం ద్వారా నేల పునరుత్పత్తిపై ఎక్కువ దృష్టి, పెట్టుబడి పెట్టడం ప్రస్తుతం అవసరంగా మారింది. మేము అదే చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కోటి మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని సాధించడానికి నాణ్యమైన మొక్కలను పెద్ద మొత్తంలో అందించడం కూడా చాలా ముఖ్యం. కావేరి కాలింగ్ ఉత్పత్తి కేంద్రాలు ఈ ప్రయత్నంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్పత్తి కేంద్రాలలో.. కడలూరులో ఓ నర్సరీ ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద సింగిల్-సైట్ నర్సరీలలో ఒకటి. దీనిని పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. ఈ నర్సరీ 85 లక్షల మొక్కలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. మిగతా 15 లక్షల మొక్కలను తిరువణ్ణామలైలోని నర్సరీ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కేంద్రాలు కావేరీ కాలింగ్ ఉద్యమానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఈ నర్సరీలు తమిళనాడు అంతటా 40 పంపిణీ కేంద్రాలను, కర్ణాటకలో 10 కేంద్రాలకు సరఫరా చేస్తాయి. ఈ నర్సరీల్లో టేకు, ఎర్రచందనం, రోజ్‌వుడ్, మహోగనితో సహా 29 మేలిరకం కలప జాతులను ఒక్కో మొక్కకు రూ. 3 సబ్సిడీ రేటుకు అందిస్తున్నాయి.
సద్గురు సన్నిధి బెంగళూరులోని నర్సరీ డిసెంబర్ 2023లో ప్రారంభించినప్పటి నుండి లక్ష మొక్కలను నాటింది. ప్రస్తుతం ఇది 1.3 లక్షలకు పైగా మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకుంది. కావేరీ కాలింగ్ రైతుల జీవనోపాధిని సైతం మెరుగుపరుస్తుంది. కావేరీ కాలింగ్ 32 వేలకుపైగా వ్యవసాయ భూములను సందర్శించడానికి 160కిపైగా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లను సైతం నియమించింది. ఈ ఎగ్జిక్యూటివ్‌లు మొక్కల ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తారు. అలాగే నేల రకం, నేల లోతును తనిఖీ చేయడం, నీటి పరీక్షను నిర్వహించడం, తద్వారా వ్యవసాయ భూములకు అనువైన చెట్ల జాతులను సిఫార్సు చేయడం చేస్తారు.
FPOలు, NGOలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, వ్యవసాయ ప్రదర్శనల ద్వారా కూడా రైతులకు రియల్-టైమ్ సలహాలను అందిస్తాయి. దాదాపు 225కిపైగా యాక్టివ్ వాట్సాప్ గ్రూపుల ద్వారా 52వేల కంటే ఎక్కువ మంది రైతులకు మద్దతు లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేసే ప్రత్యేక హెల్ప్‌లైన్, నిపుణులు మరియు మోడల్ రైతుల నుండి అంతర్దృష్టులను ఉపయోగించి 24–48 గంటల్లోపు రైతుల సందేహాలను పరిష్కరిస్తుంది.