ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఒక బీజేపీ భావిస్తుంటే.. ఇండియా కూటమి అనూహ్యంగా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో బీజేపీ మిగతా పార్టీలతో కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైసీపీ అధినేత జగన్‌కు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని బలపర్చాలని కోరినట్టు తెలుస్తోంది. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్ ఇటీవలే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
అయితే ఇదే అంశంపై గురువారం వైసీపీ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థి CP రాధాకృష్ణన్‌కు మద్దతిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది తమ పార్టీ విధానమని ఆయన తెలిపారు.
వైసీపీ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నామని బొత్స అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీకి ఎంపిక చేస్తే అందుకు వైసీపీ అధినేత జగన్ మద్ద ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తాము మద్దతిస్తున్నట్టు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.