BCCI New Rule : భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో తీవ్ర గాయాలకు గురయ్యాడు. లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు అతని వేలికి, ఆ తర్వాత మాంచెస్టర్ టెస్టులో కాలికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ గాయాల కారణంగా పంత్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ ఘటనతో అలెర్ట్ అయిన బీసీసీఐ, దేశవాళీ క్రికెట్‌లో ఒక కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఇకపై ఏ ఆటగాడు గాయపడినా అతడి స్థానంలో మరొకరిని బరిలోకి దింపే అవకాశం కల్పించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్‌లో మల్టీ-డే మ్యాచ్‌ల కోసం సీరియస్ ఇంజ్యూరీ రీప్లేస్‌మెంట్ అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ నిబంధన 2025-26 సీజన్ నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం, ఒక ఆటగాడు మల్టీ-డే మ్యాచ్ సమయంలో తీవ్రమైన గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగితే, అతడి స్థానంలో మరో సేమ్ టాలెంట్ కలిగిన ఆటగాడిని జట్టులోకి తీసుకోవచ్చు. ఈ మార్పుకు సెలక్షన్ కమిటీ, మ్యాచ్ రిఫరీ అనుమతి తప్పనిసరి.
రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాడి గాయం కారణంగా జట్టు వ్యూహం దెబ్బతినకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ ఆటను దెబ్బతీయకుండా చూస్తుంది. అయితే, ఈ నిబంధన కేవలం మల్టీ-డే మ్యాచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే వంటి వైట్-బాల్ టోర్నమెంట్లలో ఈ రీప్లేస్‌మెంట్‌కు అనుమతి ఉండదు. అలాగే, అండర్-19 టోర్నమెంట్ అయిన సీకే నాయుడు ట్రోఫీకి కూడా ఇది వర్తిస్తుంది. ఐపీఎల్ తర్వాతి సీజన్‌కు ఈ నిబంధనను అనుమతిస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఐసీసీ నిబంధనల ప్రకారం, ఆటగాడు తలకు గాయమై (కన్‌కషన్) ఆడలేని పరిస్థితిలో ఉంటే మాత్రమే రీప్లేస్‌మెంట్ అనుమతిస్తారు. కన్‌కషన్‌తో బయటకు వెళ్లిన ఆటగాడు ఏడు రోజుల వరకు ఎలాంటి మ్యాచ్ ఆడటానికి వీలులేదు. పంత్ గాయం వంటి ఇతర తీవ్రమైన గాయాలకు ప్రస్తుతం ఐసీసీ రీప్లేస్‌మెంట్‌ను అనుమతించడం లేదు. దీంతో బీసీసీఐ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..