తూర్పుమధ్య అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలోని వాయుగుండం గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తూర్పు వైపుకు నెమ్మదిగా కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రత్నగిరి సమీపంలో దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వివరించింది. మంగళవారం(27-05-25) నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటినుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆదివారం(25-05-25): అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం(26-05-25): అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా,పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 46.2, అరకబద్రలో 43,కోనసీమ జిల్లా ముమ్మిడివరం 31.5మిమీ, విజయనగరం జిల్లా మెంటాడలో 30మిమీ వర్షపాతం రికార్డయిందన్నారు. శనివారం తిరుపతి జిల్లా గంగుడుపల్లిలో 39.5 °C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..