AP DSC 2024 Exams: ఏపీలో నార్మలైజేషన్‌ లేకుండా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?

AP DSC 2024 Exams: ఏపీలో నార్మలైజేషన్‌ లేకుండా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?


అమరావతి, నవంబర్‌ 29: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల మరింత ఆలస్యం అవుతుందని ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఈ జాప్యం చోటు చేసుకుంది. ఈ నోటిఫికేషన్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 6,371, స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపల్‌ పోస్టులు 52, పీఈటీ పోస్టులు 132 వరకు ఉండనున్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో ఈసారి స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టుల సంఖ్య పెరిగింది.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు కాస్త ఆలస్యంగానైనా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో మొదట టెట్‌ నిర్వహించారు. గత నెల టెట్‌ ఫలితాలు కూడా వెల్లడించారు. ఇక నియామక ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా డీఎస్సీ నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈ లోగా అభ్యర్థులు పరీక్షల కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలని విద్యాశాఖ సూచించింది. ఇందుకు వీలుగా సబ్జెక్టుల వారీగా డీఎస్సీ సిలబస్‌ను కూడా విడుదల చేసింది.

అయితే మెగా డీఎస్సీ పరీక్షలను కూడా టెట్‌ మాదిరి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో డీఎస్సీ పరీక్షలను అనేక విడతలుగా చేపట్టాల్సి వస్తోంది. ఒక్క ఎస్జీటీ పోస్టులకు సంబంధించిన పరీక్షల నిర్వహణకే వారం రోజుల సమయం పడుతోంది. దీంతో ప్రతిసారి పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్‌ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఒక రోజు పేపరు తేలికగా వచ్చిందని, మరో రోజు కష్టంగా వచ్చిందని అభ్యర్థులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో డీఎస్సీలో ఇలా జరగకుండా రెండు, మూడు జిల్లాలకు కలిపి ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక జిల్లాలో దరఖాస్తు చేసిన వారందరికీ ఒకే రోజు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ఈ విధానంతో రెండు, మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ పూర్తిగా పరీక్షలు నిర్వహించే వీలుంటుందని ఆలోచిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన డీఎస్సీలోనూ ఇదే విధానాన్ని అమలు చేశారు. డీఎస్సీలో నార్మలైజేషన్‌ లేకుండా ఫలితాలు విడుదల చేశారు. త్వరలో ఏపీలో జరగనున్న డీఎస్సీలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *