అధికారంలోకొచ్చి తొమ్మిదినెలలు. ఏపీ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఎన్నో అంచనాలున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్‌పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమీక్షించారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ప్రధానంగా అధికారంలోకొచ్చేందుకు దోహదపడ్డ సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ని రూపొందించారు.
మరోవైపు అసెంబ్లీలో పయ్యావుల కేశవ్.. మండలిలో కొల్లు రవీంద్ర.. బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి ఏపీ బడ్జెట్.. 3లక్షల కోట్ల రూపాయల మార్క్ దాటే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్, అమరావతి, పోలవరం, వ్యవసాయం, విద్యాఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఉండనుంది. వ్యవసాయ బడ్జెట్ 50వేల కోట్ల రూపాయలు ఉండే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు.. మండలిలో నారాయణ ప్రవేశపెడతారు. 2047 నాటికి 15శాతం GSDP వృద్ధి.. 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా బడ్జెట్లో ప్రణాళికలు వేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పోలవరం, అమరావతికి భారీ కేటాయింపులు జరిపే అవకాశం ఉంది.