
ఆమె ప్రభుత్వ ఉద్యోగి.. ఎప్పటిలాగే ఉదయాన్నే కార్యాలయానికి వచ్చారు. అయితే కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో ప్రైవేటు వ్యక్తులు కూర్చొని ఉండటంతో ఆశ్చర్యపోయారు. కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థలోకి ప్రవేటు వ్యక్తులు ఎందుకు వచ్చారంటూ ఆరా తీశారు. ఆమెకు వచ్చిన సమాచారంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యాలయ అధికారుల పనితీరుపై మండిపడుతూ ఆందోళన బాట పట్టారు. ఏకంగా కార్యాలయం బయట రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. దాదాపు ఇరవై నాలుగు గంటలకు పైగా ఆమె నిరసన కొనసాగుతోంది.
తెనాలి బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్ స్పెక్టర్‌గా పనిచేస్తున్న పద్మావతి కార్యాలయం బయట ఆందోళన బాట పట్టారు. తమ కార్యాలయంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్ ను ప్రవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె నిరసనకు దిగారు. కావాల్సినంత మంది సిబ్బంది ఉన్నా కొంతమంది దురుద్దేశంతో కస్టమర్ సెంటర్ ను ప్రవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. గతంలో రేపల్లే కార్యాలయంలోనూ ఇదే విధంగా చేస్తే రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి అడ్డుకున్నట్లు ఆమె తెలిపారు.
మరోసారి తెనాలి కార్యాలయంలోనూ అదే విధంగా జరగడంతో పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా నిరసనకు దిగారు. అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర స్థాయి అధికారులు జోక్యం చేసుకునే వరకూ తన ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. నిన్న ఉదయం సమయంలో ఆందోళనకు దిగిన పద్మావతి రాత్రంతా కూడా కార్యాలయం బయటే భైఠాయించారు.
వీడియో చూడండి..
అయితే, బిఎస్ఎన్ఎల్ కార్యాలయ సిబ్బంది ఎవరూ ఇప్పటి వరకూ స్పందించలేదు. పద్మావతి కూడా వెనక్కి తగ్గడం లేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే తాను వ్యతిరేకంగా పోరాడుతున్నాని కొంతమంది స్వార్ధపరులు అవినీతికి పాల్పడుతూ అక్రమాలకు తెరతీస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించే వరకూ ఆందోళన కొనసాగిస్తానని ఆమె తెలిపారు. ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..