
విస్సన్నపేటకు చెందిన ఈ ఉపాధ్యాయుడు 8 ఏళ్ల కిందట రిటైర్డ్ అయ్యాడు. అయితే తాజాగా కొద్దిరోజుల క్రితం ఇతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్టెల్ నుంచి మాట్లాడుతున్నామని మీ సిమ్ రెండు గంటలు డియాక్టివేట్ అవుతుంది. బెంగళూరులో మీ పేరుపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందంటూ భయపెట్టారు. ఎఫ్‌ఐఆర్ అనగానే భయపడ్డ ఆ రిటైర్డ్ ఉద్యోగి.. అసలు ఏం జరిగిందని ఆరా తీశాడు. ఈలోపే వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో పోలీస్ స్టేషన్ సెటప్‌లో యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి తనని తాను ఎస్సైగా బెంగళూరు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నామంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి నెలలో మీ ఆధార్‌తో బెంగళూరులో ఒక సిమ్ కార్డ్ తీసుకున్నారని.. ముంబైలో మీ పేరుపైన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిందని.. అందులోకి ఓ నేరస్తుడి నుంచి 30 లక్షలు బదిలీ అయ్యాయని చెప్పాడు. ఆ డబ్బు మీ ఖాతాలో పడిందో.. లేదో.. చెక్ చేయాలని ఎస్ఐ వేషధారణలో ఉన్న వ్యక్తి ఉపాధ్యాయుడుతో చెప్పడం వల్ల అతడు దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ లోపే కాల్‌లో మాట్లాడుతున్న వ్యక్తి సీబీఐ కార్యాలయంలో ఉన్న ఇన్స్పెక్టర్ లైన్‌లో ఉన్నారని.. ఆయన మీతో మాట్లాడతారని వేరే వ్యక్తికి కనెక్ట్ చేశాడు.
అతను లైన్‌లోకి వచ్చాక సీబీఐ అధికారులమంటూ మాట్లాడి.. ‘మేం చెప్పిన ఖాతాకు 30 లక్షలు బదిలీ చేస్తే.. అన్ని పరిశీలించాక డబ్బు మీదేనని తేలితే తిరిగి పంపిస్తామని’ చెప్పారు. దాంతో కంగారుపడ్డ ఉపాధ్యాయుడు అసలు తనకు దీనికి సంబంధం లేదని బదులిచ్చాడు. అయినప్పటికీ ఇది పెద్ద క్రైమ్ అని వెంటనే డబ్బు చెల్లించకపోతే.. మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ బెదిరించారు. బెదిరించడమే కాకుండా ఆ డబ్బును చెల్లించాలంటూ ఆ ఉపాధ్యాయుడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బు లేదని చెప్పినప్పటికీ ఆయన్ని బలవంత పెట్టి ఇంట్లో ఏమైనా బంగారం ఉంటే తాకట్టు పెట్టి చెల్లించాలంటూ దాదాపు కొన్ని గంటల పాటు ఒత్తిడి చేశారు. దాంతో చేసేదేమిలేక భయాందోళనకు గురైన ఉపాధ్యాయుడు ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి 13.5 లక్షలు తీసుకొచ్చి వారు చెప్పిన ఖాతాకు జమ చేశాడు.
అంతటితో ఆగని నేరగాళ్లు ఇంకా చెల్లించాలంటూ ఒత్తిడి చేయడంతో చుట్టుపక్కల తెలిసిన వాళ్ల అందరి దగ్గర దాదాపు 5 లక్షల వరకు అప్పు చేసి ఆ డబ్బును కూడా జమ చేశాడు. అయినప్పటికీ నేరగాళ్ల ఒత్తిడి ఆగిపోవడంతో అనుమానం వచ్చి అప్పుడు పోలీసులు ఆశ్రయించాడు. అప్పటికే ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలయ్యానని ఉపాధ్యాయుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటివి నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.