
నెల్లూరు రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్ శ్రీకాంత్ సహకారంతో నేరాలకు పాల్పడుతోందనే ఫిర్యాదులతో అరుణను కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 4 రోజుల క్రితం ఓ సీఐకి ఫోన్ చేసి హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ అరుణ బెదిరించిన విషయం కూడా ఇప్పుడు వెలుగు చూసింది. తన ఇంటిని అరుణ అద్దెకు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇంటిని లాక్కునే ప్రయత్నం చేసిందంటూ ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేసిందంటూ చాలా మంది కంప్లెంట్స్ ఇస్తున్నారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పడం లేదని అరుణ అంటోంది, కొందరు కానిస్టేబుళ్లు వచ్చి రోడ్డుపై కారు ఆపి గంజాయి లోపల పెట్టాలని చూశారని అరుణ ఆరోపిస్తోంది. అరుణపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఆమె పూర్తి వ్యవహారాలపై పోలీసులు, నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.
కాగా.. ఇటీవల అరుణ, శ్రీకాంత్ కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.. జీవిత ఖైదు అనుభవస్తున్న వ్యక్తితో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అరుణ హల్ చల్ చేసింది. ఏకంగా ఇద్దరూ సరసాలు ఆడుకుంటూ కనిపించారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు ఈ విషయంపైనా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.. ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో గూడూరుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి కోర్టు శిక్ష వేసింది. 2010 నుంచి నెల్లూరు కేంద్ర కారాగారంలో అతను ఖైదీగా ఉన్నాడు. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన శ్రీకాంత్.. 2018 నవంబరులో మళ్లీ పోలీసులకు చిక్కి అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. శ్రీకాంత్ కారాగారంలో ఉంటే అతని గ్యాంగ్‌ను తానే నడిపిస్తూ దందాలు చేయిస్తున్నట్లు అరుణపై అభియోగాలున్నాయి. ఈ క్రమంలో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు శ్రీకాంత్ ను అరుణ కలిసిన వీడియోలు బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమెకు పలువురు ఉన్నతాధికారులు కూడా సహకరించినట్లు చెబుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..