అమరావతి రాజధాని నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. శరవేగంగా పనులు పూర్తిచేస్తోంది. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో అమరావతికి కొత్త రూపు ఇవ్వడానికి 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 904 కోట్ల నిధులు కేటాయిస్తూ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నీటి సరఫరాకు రూ. 64 కోట్లు, సీవరేజ్ వాటర్‌కు రూ. 110 కోట్లు, రహదారులకు రూ. 300 కోట్లు, వీధి దీపాలకు రూ. 12 కోట్లు కేటాయించారు.
మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువలరీ పార్క్ 78 ఎకరాల్లో ఏర్పాటు కోసం భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ పార్క్ ద్వారా 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్స్‌లో అసైన్ భూమి అని పేర్కొనటం వల్ల తాము నష్టపోతున్నామన్న రైతుల విజ్ఞప్తి మేరకు అసైన్ అనే పదాన్ని తొలగించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేశారన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం 2 ప్యాకేజీల కింద నీటిని శుద్ధి చేసేందుకు రూ.411 కోట్లతో ఒక ప్యాకేజీ, నీటి సరఫరా కోసం రూ.376 కోట్లతో మరో ప్యాకేజీకి ఆమోదం తెలిపారని వివరించారు. SRM, విట్ సంస్థలకు మెడికల్, డెంటల్, పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు చెరో 100 ఎకరాలు కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.
కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్
మరోవైపు రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. ప్రతీ ప్రాజెక్టు పరిధిలోనూ ఆర్ధిక కార్యాకలాపాలు జరిగేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. టోటల్‌గా అమరావతి పనులు మరింత స్పీడప్ చేయడానికి చంద్రబాబు అండ్ టీమ్ నాన్‌స్టాప్ ఎక్సర్‌సైజ్ కొనసాగిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.