భార్య మరణించింది. ఆమె చనిపోతూ చెప్పిన ఒక మాట.. నేను చనిపోతే నా అస్థికలు గుజరాత్‌లోని మా ఊర్లోని ఓ చెరువులో కలపండి అని కోరింది. ఆ మాట చెప్పి ఆమె చనిపోయింది. భార్య చివరి కోరిక తీర్చేందుకు భర్త లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు. తన చివరి కోరిక తీరిస్తూ.. ఆమె అస్థికలను చెరువులో కలిపాడు. తన భార్య అంతిమ కోరిక తీర్చాననే ఆత్మ సంతృప్తితో లండన్ తిరిగి వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కాడు. పాపం.. కొన్ని నిమిషాల్లోనే అతను కూడా అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాదం గురువారం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన మరణించిన వారిలో ఒకరిది.
అర్జున్ పటోలియా తన భార్య భారతి, ఎనిమిది, నాలుగు సంవత్సరాల వయస్సు గల వారి ఇద్దరు కుమార్తెలతో లండన్‌లో నివసించారు. భారతి కొన్ని రోజుల క్రితం మరణించారని, ఆమె అస్థికలను గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని వాడియా అనే తన పూర్వీకుల గ్రామం వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేయాలనే ఆమె కోరికను తీర్చడానికి అర్జున్ ఇండియాకు వచ్చాడు. ఈ నెల ప్రారంభంలో వాడియాలో భారతి స్మారక కార్యక్రమం కూడా నిర్వహించాడు. గురువారం అర్జున్ అహ్మదాబాద్ నుండి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం 171 ఎక్కి 241తో పాటు అతను కూడా మృత్యువడిలోకి జారుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు.
10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు సహా 242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన 32 సెకన్లకే కూలిపోయిన విషయం తెలిసిందే. 672 అడుగుల ఎత్తుకు ఎగిరిన తర్వాత విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉన్న మేఘని నగర్‌లోని బిజె మెడికల్ కాలేజీ కాంప్లెక్స్‌లోని భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. విశ్వష్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..