AIMIM: థర్డ్‌ ఫ్రంట్‌కు సిద్ధమవుతున్న అసదుద్దీన్‌ ఒవైసీ..! రసవత్తరంగా మారిన బిహార్‌ రాజకీయం

AIMIM: థర్డ్‌ ఫ్రంట్‌కు సిద్ధమవుతున్న అసదుద్దీన్‌ ఒవైసీ..! రసవత్తరంగా మారిన బిహార్‌ రాజకీయం


బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయాలు వేడెక్కాయి. బీహార్‌లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) కూటమి ఇండియా బ్లాక్, రాష్ట్రాన్ని పాలిస్తున్న నితీష్ కుమార్ నేతృత్వంలోని NDA మధ్య ఉంది. ఎన్నికలకు ముందు కూటమి తన పూర్తి బలాన్ని ప్రదర్శిస్తోంది. తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ ప్రభుత్వంపై నిరంతరం దాడి చేస్తుండగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ సంవత్సరం ఐదుసార్లు బీహార్‌ను సందర్శించారు. బిజెపి ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడంతో పాటు, ఆయన దళితులు, ముస్లింలు, వెనుకబడిన వర్గాలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) గత ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ నుంచి ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు తరువాత RJDలో చేరారు. ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి AIMIM పూర్తి సన్నాహాలు చేసింది. బీహార్ AIMIM అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ NDA కి వ్యతిరేకంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇండియా బ్లాక్‌కు ప్రతిపాదించారు.

థర్డ్‌ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు

అఖ్తరుల్ ఇమాన్ మాట్లాడుతూ.. “ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఫ్రంట్ కింద అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనతో మేం మహా కూటమిలోని నాయకులను సంప్రదించాం, కానీ వారు ఇంకా స్పందించలేదు.” బీహార్ ఎన్నికలకు తాము పూర్తి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. తన పార్టీ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయగలదని, NDA, మహా కూటమి రెండింటినీ సవాలు చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన ఎంపికను అందించడానికి అసవరమైతే మూడవ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని, అనేక ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని ఇమాన్‌ అన్నారు. జనతాదళ్ (యునైటెడ్) నేతృత్వంలోని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేయాలనే AIMIM ప్రతిపాదనపై మహా కూటమి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ మజ్లిస్‌ పార్టీ ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ నెలలో బీహార్‌లో పర్యటించబోతున్నారని, ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతో సంప్రదించి తీసుకుంటామని, ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని అఖ్తరుల్ ఇమాన్ అన్నారు. సీమాంచల్‌లో ‘జూనియర్ ఒవైసీ’ అని పిలువబడే ఇమాన్, బీహార్‌లో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక ప్రజా నాయకుడిగా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *