Aadhaar: కార్మికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఈ సేవలకు ఆధార్‌ అవసరం లేదు!

Aadhaar: కార్మికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఈ సేవలకు ఆధార్‌ అవసరం లేదు!


వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి అనే నిబంధన విస్తృతంగా ఉన్న వేళ, కార్మిక మంత్రిత్వ శాఖ కీలకమైన ప్రకటన చేసింది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) ప్రయోజనాలను పొందేందుకు ఆధార్‌ ధృవీకరణ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం లక్షలాది మంది కార్మికులకు ఎంతో ఉపశమనం కల్పించనుంది.

ఆధార్‌ బదులు ఇతర పత్రాలు:

ఆధార్‌ లేనివారు, లేదా దాన్ని ఉపయోగించడానికి ఇష్టపడనివారు ఇకపై పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఈఎస్‌ఐసీ సేవలను పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రయోజనాల పంపిణీని సరళతరం చేయడానికే ఆధార్‌ను ప్రవేశపెట్టారు. కేవలం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇది దోహదపడుతుంది. కానీ, ఆధార్‌ లేనంత మాత్రాన సేవలు నిరాకరించబోరని ESIC స్పష్టం చేసింది.

డిజిటల్‌ కార్యక్రమాలు..

లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కార్మిక శాఖ మరిన్ని వివరాలు వెల్లడించింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలోని ఆసుపత్రులతో భాగస్వామ్యం, శాశ్వత వైకల్యం, మరణాలకు పరిహార రేట్లు పెంచడం, మహిళలకు నగదు ప్రయోజనాల క్లెయిమ్‌లు డిజిటల్‌గా సమర్పించేందుకు కొత్త పోర్టల్‌ లాంటి పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఈఎస్‌ఐసీ ప్రయోజనాలు అర్హులైన వారికి సక్రమంగా చేరవేయడమే తమ లక్ష్యమని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.

ఆధార్‌పై అధికారిక నోటిఫికేషన్‌

ఆగస్టు 19, 2025న విడుదలైన అధికారిక నోటిఫికేషన్‌లో, ‘ఆధార్‌ చట్టం, 2016’లోని నిబంధనల ప్రకారం, ఆధార్‌ నంబర్‌ ద్వారా ధృవీకరణ చేపట్టేందుకు ESICకు అనుమతి లభించినట్లు పేర్కొంది. అయితే, ధృవీకరణ చేపట్టే ముందు ఆధార్‌ ఉన్నవారి నుండి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *