హైదరాబాద్, మే 22: రాగల 2-3 రోజులలో కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. అరేబియా సముద్రంలో నేడు అల్పపీడనం ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా ఆంధ్ర తీరం వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో నేడు తెలంగాణలోని 33 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ వాతావరణ కేంద్రం జారీ చేసింది.
ఇక రాష్ట్ర ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే..
ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 40.3, కనిష్టంగా మహబూబ్ నగర్ లో 29.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- ఆదిలాబాద్.. 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- నిజామాబాద్.. 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- రామగుండం.. 38.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- ఖమ్మం.. 37.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- నల్లగొండ.. 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- భద్రాచలం.. 36.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- హనుమకొండ.. 36.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- హైదరాబాద్.. 35.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మహబూబ్ నగర్.. 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మెదక్.. 34.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు
రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
బుధవారం రాత్రి హైదరాబాద్‌లో కుండపోత..
బుధవారం రాత్రి నగరంలో భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో మోకాళ్ల లోతు వరకూ నీరు చేరింది. దీంత జన జీవనం స్తంభించింది. బండ్లగూడలో 87.3, ఆస్మాన్‌ఘర్‌లో 82.5, మలక్‌పేటలో 82.3, సరూర్ నగర్ లో 77.8, మూసారంబాగ్ లో 75.8, ఎల్బీనగర్‌లో 69.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, నల్లగొండ జిల్లాలో ఒక్కరు మృతి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుతో పశువుల, మేకలు, గొర్రెలు మృతి చెందాయి. వర్షాలతో పాటు పిడుగుల బీభత్సం సృష్టించాయి. హైడ్రా, అగ్నిమాపక బృందాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ.. వర్షాకాలంలో విపత్తుల నిర్వహణకు రాష్ట్ర స్థాయి బృందాలు ఏర్పాటు చేసింది.12 పోలీస్ బెటాలియన్లలోని 100 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో ఎన్ఆర్డీఎఫ్ బృందాలు సిద్ధం.. పాత జిల్లా కేంద్రాల్లో అగ్నిమాపక బృందాలు వరద నివారణకు సిద్ధం చేశారు. నగరపాలక సంస్థల పరిధిలో జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో హైడ్రా బృందాలు అందుబాటులో ఉన్నాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.