పాకిస్తాన్ గూఢచర్యం కేసులో హర్యానాలోని కైతాల్ నుండి అరెస్ట్ అయిన దేవేంద్ర సింగ్ ధిల్లాన్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారు దేవేంద్ర సింగ్ ధిల్లాన్ 25 ఏళ్ల యువకుడు. పాటియాలా కళాశాలలో ఎం.ఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పాకిస్తాన్ ఇంటలిజెన్స్ కి చెందిన నలుగురు పురుషులు ఒక మహిళ హనీ ట్రాప్‌తో గూఢచర్యం ఉచ్చులో ఇరుక్కున్నాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్ చాలా మంది యువతను హనీ ట్రాప్‌లో దించుతూ గూఢచర్యానికి ఉసిగొల్పుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం హనీ ట్రాప్ కి పాల్పడుతున్న అమ్మాయి గురించి తెలుసుకోవడానికి భారత దర్యాప్తు నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దేవేంద్ర సింగ్ నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు 300 జీబి డేటా ఉన్న రెండు డిజిటల్ డివైజెస్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. దర్యాప్తు లో భాగంగా పాటియాలా కంటోన్మెంట్ వద్ద ఉన్న వీడియోను పాక్ ఏజెంట్లకు పంపినట్లు అంగీకరించాడు దేవేంద్ర సింగ్. దేవేంద్ర సింగ్ బ్యాంకు ఖాతాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.
గతేడాది నవంబర్ నెలలో దేవేంద్ర సింగ్ ధిల్లాన్ 3000 మందితో కలిసి కర్తార్‌పూర్ కారిడార్‌కు వెళ్లాడు. అందులో దాదాపు 125 మంది హర్యానాకు చెందినవారు ఉన్నారు. వాఘా సరిహద్దు చేరుకున్నప్పుడు, విక్కీ అనే పాకిస్తానీ పౌరుడిని కలిశాడు. అతను పాకిస్తాన్ ISI కోసం పనిచేస్తున్నాడని దేవేంద్రకు తెలియదు. విక్కీ దేవేంద్రకు సహాయం చేశాడు. కర్తార్‌పూర్ ఆలయంలో పూజ చేయించాడు. అక్కడి నుంచి లాహోర్ వెళ్ళారు. అక్కడ విక్కీ, దేవేంద్రకు అర్సలాన్ అనే వ్యక్తికి పరిచయం చేశాడు. అక్కడి నుండి ఒక హోటల్‌లో విక్కీ, అర్సలాన్ మరో మహిళా స్నేహితురాలు కలిశారు. ఒకరి నంబర్లు ఒకరు మార్చుకున్నారు. షాపింగ్‌కు వెళ్ళారు. ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ ఐడి కూడా దేవేంద్ర తీసుకున్నాడు. అయితే, భారతదేశానికి తిరిగి వచ్చాక దేవేంద్రను ఆమె బ్లాక్ చేసింది.
అయితే QR కోడ్ ఉన్న భారతీయ ఫోన్ నంబర్‌కు 1500 డిపాజిట్ చేయమని దేవేంద్రను అడిగాడు విక్కీ. అది పేదవాడికి సహాయపడుతుందని చెప్పాడు. విక్కీ పంపిన ఇండియన్ QR నంబర్‌కి 1500 డబ్బును దేవేంద్ర పంపాడు. ఆ తరువాత విక్కీ ద్వారా దేవేంద్ర తన పరిచయస్తులను కర్తార్‌పూర్ సాహిబ్‌లో పూజలు చేయమని కోరాడు. ఆ తరువాత దేవేంద్ర ద్వారా ఇండియన్ సిమ్ కార్డు తీసుకున్నాడు విక్కీ. ఈ నేపథ్యంలోనే భద్రతా సంస్థలు ఆ భారతీయ సిమ్ నంబర్‌ను దర్యాప్తు చేస్తున్నాయి. నంబర్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనితో పాటు దేవేంద్ర సింగ్ ధిల్లాన్ స్టేట్‌మెంట్స్ కూడా ధృవీకరిస్తున్నారు.
దేవేంద్ర అరెస్ట్ ఎలా జరిగింది..?
మే 11న, దేవేంద్ర వద్ద ఆయుధాలకు లైసెన్స్ లేకపోయినా, పిస్టల్స్, తుపాకులతో ఉన్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడని గుహ్లా పోలీస్ స్టేషన్‌లో ఒక సెక్యూరిటీ ఏజెంట్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు మే 13న దేవేంద్రను అదుపులోకి తీసుకుని రెండు రోజుల రిమాండ్‌పై విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో, అతని మొబైల్ ఫోన్ నుండి పాకిస్తాన్‌కు సున్నితమైన సమాచారాన్ని పంపినట్లు ఆధారాలు లభించాయి. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు.
హనీ ట్రాప్ కోణం
దర్యాప్తులో దేవేంద్రను వలలో వేసుకున్న అమ్మాయి గతంలో కూడా చాలా మంది భారతీయ యువకులను తన అందం ఉచ్చులో బంధించి, వారిని గూఢచర్యం చేయమని బలవంతం చేయడానికి ప్రయత్నించిందని తేలింది. అంతేకాదు, హనీ ట్రాప్ అనేది ISI కుట్రలో అతి ముఖ్యమైన భాగం. ఐఎస్ఐ గతంలో కూడా భారత సంతతికి చెందిన చాలా మందిని హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న ఈ కేసులో నిఘా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..