కర్ణాటకలో పాము కాటు కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేవలం 120 రోజుల్లోనే 3259 కేసులు నమోదయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, 20 మంది పాముకాటుతో మరణించారు. పాము కాటు కేసుల పెరుగుదల నేపథ్యంలో TV9 ప్రజల్ని హెచ్చరిస్తూ, పాముల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? పాము కాటు నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ పలు కార్యక్రమాలను టీవీ9 కన్నడ ప్రసారం చేసింది. దాంతో అప్రమత్తమైన కర్ణాటక ఆరోగ్య శాఖ ఇప్పుడు పాము కాటు మరణాలపై సీరియస్ యాక్షన్ మొదలుపెట్టింది.
సిలికాన్ సిటీ బెంగళూరును చేర్చడంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఇది ఆరోగ్య శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత వారంలోనే 243 పాముకాటు కేసులు నమోదయ్యాయి. ఈ బాధితుల్లో ఇద్దరు పాముకాటుకు గురై మరణించారని తెలిసింది. ఇక ఈ ఏడాది జనవరి నుండి 3259 మంది పాములు కాటుకు గురయ్యారు. 20 మంది మరణించారు. రాష్ట్రంలో పెరుగుతున్న పాముకాటు కేసులతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ పాముకాటు కేసులు, మరణాలపై ఆడిట్ నిర్వహించాలని యోచిస్తోంది.
గత మూడేళ్లలో రాష్ట్రంలో 60 మందికి పైగా పాముకాటుతో మరణించారని సమాచారం. కొందరు సకాలంలో చికిత్స అందక మరణించారు. మరికొందరు మందులు దొరకక మరణించారు. మూడు సంవత్సరాలలో 15,000 మంది పాములు కాటుకు గురయ్యారు. ఈ సంఖ్య ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉంది. పాముకాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మండలాలు, జిల్లా ఆసుపత్రులు పాముకాటు చికిత్సకు అవసరమైన మందులను నిల్వ ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..