తినేటప్పుడు, ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఎక్కిళ్ళు వస్తుంటాయి. ఇలా సాధారణంగా అందరికీ జరుగుతుంది. ఎక్కిళ్ళు ప్రారంభమైనాక నిమిషానికి 4 నుంచి 60 సార్లు ఇవి సంభవిస్తాయని సైన్స్ చెబుతోంది. ఇది ఒక్కోసారి కొన్ని నిమిషాల నుంచి కొన్ని నెలల వరకు కూడా ఉంటుంది! అంతేకాకుండా ఎక్కిళ్ళు ఎక్కువ కాలం ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది.
మన డయాఫ్రాగమ్లో అసౌకర్యం ఉన్నప్పుడు మనకు ఎక్కిళ్ళు వస్తాయి. డయాఫ్రాగమ్ అనేది కండరాల పొర. ఇది ఛాతీ కుహరాన్ని ఉదర కుహరం నుంచి వేరు చేస్తుంది. తలక్రిందులుగా ఉన్న గిన్నెలా కనిపించే ఈ పొర మన శ్వాసక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ డయాఫ్రమ్ అకస్మాత్తుగా కుంచించుకుపోవడం వల్ల ఎక్కిళ్ళు వస్తాయి.
ఎక్కువ ఆహారం తినడం, త్వరగా తినడం, ఉత్సాహం, భయం లేదా ఆందోళన, అధికంగా తాగడం, ఒత్తిడి, అన్నవాహికలో అసౌకర్యం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు వంటి వాటివి ఎక్కిళ్లకు కారణమవుతాయి.
ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే.. మీ శ్వాసను 10-20 సెకన్ల పాటు బిగపట్టి పట్టుకోవాలి. ఇలా చేస్తే వెంటనే ఆగిపోతాయి. మీకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు రెండు మోకాళ్ళను మీ ఛాతీ వరకు లాగి ముందుకు వంగి కొద్ది నిమిషాల పాటు ఉండాలి. ఇలా చేస్తే డయాఫ్రాగమ్పై ఒత్తిడి పెరిగి ఎక్కిళ్లు ఆగుతాయి.
చల్లటి నీటితో పుక్కిలించడం, లేదా ఐస్-చల్లటి నీటిని తాగడం వల్ల వేగస్ నాడి ఉత్తేజితమవుతుంది. వేగస్ నాడి డయాఫ్రాగమ్కు అనుసంధానించబడి ఉంటుంది. కాబట్టి ఈ నాడి డయాఫ్రాగమ్ విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. సాధారణంగా, అకస్మాత్తుగా ఎక్కిళ్ళు ప్రారంభమైనప్పుడు, చాలా మంది ఒకేసారి ఒక గ్లాసు నీరు త్రాగాలని కూడా సిఫార్సు చేస్తారు. ఇది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.