ముంబై, ఫిబ్రవరి 27: మహారాష్ట్రలోని బుల్ధానాలో గతేడాది డిసెంబర్‌లో వింత వ్యాధి ప్రబలిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా పిల్లలు మొదలు వృద్ధుల వరకు అకస్మాత్తుగా జుట్టు రాలిపోవడం కలకలం రేపింది. చూస్తుండగానే అందరికీ బట్టతలలు వచ్చేశాయి. ఇలా కేవలం రెండు నెలల్లోనే 18 గ్రామాల్లో 279 మందికి జుట్టు ఊడిపోయింది. ఈ కేసుకు సంబంధించిన వైద్య నివేదిక మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం వెలువడించింది. ఆ ప్రాంతంలోని ప్రజలు ఆహారంగా వినియోగించే గోధుమలలో సెలీనియం స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్లే ఇలా జరుగుతుందని తేలింది.
ప్రాథమిక నివేదికల ప్రకారం.. పంజాబ్, హర్యానాల నుంచి వచ్చిన గోధుమల్లో సెలీనియం స్థాయిలు ఎక్కవగా ఉందని. ఇదే ప్రజల జుట్టు రాలడానికి కారణమని తెలిసింది. ఈ గోధుమలలో సెలీనియం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అక్కడి స్థానిక ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్న గోధుమలు పంజాబ్, హర్యానా నుంచి వచ్చాయని తేలింది. వీటిని మహారాష్ట్రలోని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ అయినట్లు తేలింది. మహారాష్ట్రలో స్థానికంగా పండించిన గోధుమల కంటే పంజాబ్, హర్యానాలో పండించిన గోధుమలలో 600 రెట్లు ఎకువ సెలీనియం ఉందని పరిశోధనలో తేలినట్లు ప్రభుత్వ నివేదిక పేర్కొంది. అయితే ఈ అసాధారణ ఆరోగ్య సమస్యకు అసలు కారణాన్ని కనుగొనడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) ఇతర ఆహార పదార్థాలను కూడా పరీక్షిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే మరే ఇతర రాష్ట్రం నుంచి ఇలాంటి సమస్యలు తలెత్తలేదని ఆహార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
కాగా భారత ఆహార సంస్థ (FCI) నిర్వహించే కేంద్ర నిల్వకు పంజాబ్ అతిపెద్ద గోధుమల సరఫరాదారు. ఆ తరువాత స్థానంలో హర్యానా, మధ్యప్రదేశ్ ఉన్నాయి. గత సీజన్‌లో పంజాబ్ 128 లక్షల టన్నుల గోధుమలను FCIకి సరఫరా చేసింది. ఇది మొత్తం నిల్వలో దాదాపు 47%. ఈ గోధుమలను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పధకం కింద ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద ఉచితంగా రేషన్ సరుకులతో అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.