
జోగిపేట, ఫిబ్రవరి 27: నడి రోడ్డుపై వృద్ధ మహిళ మృతదేహం వద్ద ఆమె కూతురు నిర్విరామంగా ఏడుస్తూనే ఉంది. అటుఇటు వచ్చేవాళ్లు చూస్తున్నారే తప్ప ఏం జరిగిందని కనీసం అడగలేదు. అలా ఏకంగా 12 గంటలపాటు అభాగ్యురాలైన వృద్ధురాలి శవం రోడ్డుపైనే ఉండిపోయింది. కనీసం మున్సిపల్ సిబ్బంది కూడా కన్నెత్తి చూడలేదు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూతురు ఎందరిని వేడుకున్నా ఎవరూ కనికరించలేదు. ఈ హృదయవిదారక ఘటన మెదక్ జిల్లా జోగిపేటలో ఫిబ్రవరి 26 (బుధవారం) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
జోగిపేటలో విద్యావతి (68) అనే వృద్ధురాలు స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఒక గుడిసెలో నివాసం ఉంటోంది. ఆమెకు అశ్వినీ అనే ఓ కుమార్తె కూడా ఉంది. కాగితాలు, పాత సామాన్లు సేకరించి వాటిని అమ్ముకొని కూతురు అశ్వినితో కలిసి జీవనం సాగించేంది. కొంతకాలం క్రితం కుమార్తెకు వివాహం జరిపించగా.. కుమార్తె భర్త ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో చౌటకూరు మండలం శివ్వంపేట ప్రాంతంలోని ఓ కంపెనీలో పని చేయసాగింది. బుధవారం శివరాత్రి పండుగ నేపథ్యంలో తల్లి వద్దకు వచ్చిన అశ్విని.. గుడిసెలో తల్లిని ఎంత పిలిచినా ఉలుకు పలుకూ లేకపోవడంతో బోరున విలపిస్తూ కూర్చుంది.
తల్లి మృతదేహాన్ని ఖననం చేసేందుకు అయినవారెవరూ లేకపోవడంతో పక్కనే ఉన్న మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి తల్లి అంత్యక్రియలు చేయాలని కోరింది. పోలీసులకు చెబితేనే చేస్తామని వారు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక రోడ్డుపైనే విలపిస్తూ కూర్చుంది. రోడ్డుపై వెళ్తున్న పోలీసులకు కూడా చెప్పినా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో చివరకు పటాన్‌చెరు ప్రాంతంలో తనకు తెలిసిన వారికి కూతురు అశ్విని ఫోన్ చేసింది. వారు వచ్చి మున్సిపల్ అధికారులను వేడుకున్నా స్పందించలేదు. చివరికి రూ.2 వేల ఇచ్చి ఓ అంబులెన్స్‌ను మాట్లాడుకొని స్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ రూ.1500లతో జేసీబీతో గోతి తీయించి అంత్యక్రియలు పూర్తి చేశారు. దిక్కుతోచని స్థితిలో తల్లి మృతదేహం వద్ద కూతురు అశ్విని ఏడవడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. కానీ సాయం చేసేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. సాటి మనిషిని చూసి అయ్యోపాపం అనడం, వారిని వీడియోలు తీయటం అలవాటైపోయిన మనిషిలో మానవత్వం ఎన్నడో అడుగంటిందన్న విషయం బహుశా ఆమెకు తెలియలేదేమో..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.