ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా విశ్లేషణలో వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ 6.8శాతం నుంచి 7శాతం మధ్య బలమైన వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ఎస్బీఐ అంచనా వేసింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 6.5శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం.
ఆర్బీఐ అంచనాలను మించి..
ఎస్బీఐ నివేదిక ప్రకారం.. మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.9 శాతంగా ఉండవచ్చని, స్థూల విలువ ఆధారిత వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా. ఎస్బీఐ యొక్క ‘నౌ కాస్ట్ మోడల్’ ప్రకారం.. ఈ వృద్ధి రేటు స్థిరమైన ఆర్థిక పురోగతిని సూచిస్తుంది. అయితే ఈ నివేదిక 2026 ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీ వృద్ధిని 6.3 శాతంగా అంచనా వేసింది. ఇది ఆర్బీఐ వార్షిక లక్ష్యం 6.5 శాతం కంటే తక్కువ. రెండో క్వార్టర్ నుంచి నాలుగవ క్వార్టర్ వరకు ఆర్బీఐ వృద్ధి అంచనాలతో పోలిస్తే..ఎస్బీఐ 0.2 శాతం పాయింట్లు తగ్గించింది.
తగ్గుతున్న అంతరం
నివేదికలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వాస్తవ జీడీపీ, నామమాత్ర జీడీపీ వృద్ధి మధ్య అంతరం గణనీయంగా తగ్గుతోంది. 2023 ఆర్థిక సంవత్సరం తొల త్రైమాసికంలో 12 శాతం పాయింట్లుగా ఉన్న ఈ అంతరం, 2025 నాటికి నాటికి 3.4 శాతానికి పడిపోయింది. తక్కువ ద్రవ్యోల్బణ స్థాయిల కారణంగా Q1 FY26లో ఈ అంతరం మరింత తగ్గుతుందని నివేదిక సూచించింది. ఈ తగ్గుతున్న అంతరం ప్రస్తుత వృద్ధి ఊపులో మందగమనాన్ని సూచిస్తుందని ఎస్బీఐ పేర్కొంది. వాస్తవ జీడీపీ వృద్ధి బలంగా ఉన్నప్పటికీ, నామమాత్ర GDP 8 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసింది. ఏదేమైనా, తొలి త్రైమాసికంలో అంచనా వేసిన బలమైన వృద్ధి రేటు భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతంగా పరిగణించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..