Andhra Pradesh: ఏనుగులతో భయం భయం.. గజ యాప్ తీసుకొచ్చిన సర్కార్.. ఎలా పనిచేస్తుందంటే..?

Andhra Pradesh: ఏనుగులతో భయం భయం.. గజ యాప్ తీసుకొచ్చిన సర్కార్.. ఎలా పనిచేస్తుందంటే..?


ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక నూతన యాప్‌ను ప్రవేశపెట్టింది. ‘గజ’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ యాప్.. రాష్ట్రంలో తొలిసారిగా ఏనుగుల కదలికలు, వాటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను క్షణాల్లో తెలుసుకునేలా రూపొందించబడింది. జిల్లాలో ఏనుగుల సంచారం మొదలైనప్పటి నుంచి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 13 మంది ఏనుగుల దాడుల్లో మరణించగా, కోట్ల విలువైన పంటలు నాశనమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం, పాలకొండ ప్రాంతాల్లో రెండు గ్రూపులుగా విడిపోయి 13 ఏనుగులు తిరుగుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది.

గజ యాప్ వల్ల ప్రయోజనాలు..

ఈ యాప్ ద్వారా ఏనుగులు తిరిగే ప్రాంతాలు, ప్రాణ నష్టాలు, పంట నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర సమాచారాన్ని నమోదు చేస్తారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే, యాప్ ద్వారా వెంటనే అధికారులకు సమాచారం అందుతుంది. దీంతో సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయం అందించవచ్చు. ఇది ఏనుగుల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ యాప్ పనితీరును మరింత సమర్థవంతం చేసేందుకు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రసూన ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్షన్ అధికారులు, బీట్ సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత వారి మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, రోజువారీ వివరాలు నమోదు చేసేలా ప్రోత్సహిస్తారు. ఈ విధానం ద్వారా ఏనుగుల కదలికలను రియల్‌ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. స్థానికులకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వవచ్చు.

మన్యం జిల్లా వ్యాప్తంగా ఏనుగుల సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి రాత్రిపూట కాపలా కాస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పాఠశాలలు మూసివేశారు. పిల్లలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. గజ యాప్ ద్వారా ఈ పరిస్థితులు మారుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఇప్పటికే పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, యాప్ ఉపయోగాన్ని వివరిస్తున్నారు. ఏనుగులను బాధపెట్టకుండా వాటి సహజ ఆవాసాలను కాపాడుకుంటూ మానవుల భద్రతను హామీ ఇవ్వడమే ఈ యాప్ లక్ష్యమని అంటున్నారు అధికారులు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను ఉపయోగించుకొని ఏనుగుల కదలికలను తెలుసుకొని ఏనుగుల బారి నుంచి రక్షణ పొందాలని కోరుతున్నారు అటవీ శాఖ అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *