భర్త ఆకలికన్నా టీవీ సీరియల్ ముఖ్యమా అని భార్యని ఆ భర్త మందలించడంతో మనస్తాపానికి గురై బిడ్డతో సహా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారం మండలం కోడిపుంజులతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తండాకు చెందిన దారావత్ రాజు – కవిత దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల భర్త రాజు పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి అన్నం పెట్టమని భార్యను అడిగాడు.. అయితే అప్పటికే టీ.వీ లో సీరియల్‌లో మునిగిపోయిన భార్య.. అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు అన్నం వడ్డిస్తానని భర్తతో చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది.
దీంతో భర్త నా ఆకలికంటే నీకు సీరియల్ ముఖ్యమా అని ఆగ్రహం వ్యక్తం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త తనపై కోపగించుకోవడంలో మనస్థాపానికి గురైన భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. తప కుమారుడికి పురుగుల మందు తాగించి.. తాను కూడా అదే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.. కూతురికి తాగిస్తుండగా అప్పటికే బయటినుంచి ఇంటికి వచ్చిన భర్త గమనించి అడ్డుకున్నాడు.
వేంటనే పురుగుల మందుతాగిన తల్లీ కుమారుడిని స్థానికుల సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించాడు. వారిని పరీక్షించిన వైద్యులు కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో.. మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.