టమోటా ధరలు మరోసారి పైచూపు చూస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టమోటా ధర విపరీతంగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం కిలో రూ.20 నుంచి 30 వరకు ఉండగా.. ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.60 నుంచి 70కి అమ్ముడవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లడంతో సప్లై తగ్గి ఈ ఆకస్మిక ధర పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. మార్కెట్‌కు వచ్చే టమోటాల పరిమాణం సాధారణ ఇన్‌ఫ్లోలో సగం కంటే తక్కువగా ఉందని.. దీని వల్ల కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
వర్షాలు కొనసాగి సప్లై సమస్యలు పరిష్కారం కాకపోతే.. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రిటైలర్లు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు ఇప్పటికే గృహ బడ్జెట్‌లను దెబ్బతీస్తున్నాయి. అనేక కుటుంబాలు రోజువారీ ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా పేద, మిడిల్ క్లాస్ వర్గాలు.. పెరుగుతున్న కూరగాయల ధరలతో మరింత వర్రీ అవుతున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు టమోటా సరఫరాలో జాప్యం కూడా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని టమోటాలు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కిలోకు రూ.50–60 వరకు అమ్ముడవుతుండగా.. ఇతర జిల్లాల్లో ధర రూ.35 నుంచి 45 మధ్య ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.