వంట చేసేటప్పుడు ఉపయోగించే పాత్రల నాణ్యత ఆహారం యొక్క పోషక విలువలను నిర్ణయిస్తుంది. మనం తినే ఆహారం ఎంత ఆరోగ్యకరమైనదైనా, వంట చేసే పాత్రలో లోపం ఉంటే అది ప్రాణాంతకం కావచ్చు. తాజాగా, భారతీయ వంటపాత్రల విషయంలో ఇదే నిజమని తేలింది.
సీసం ఎందుకంత ప్రమాదకరం?
సీసం విషపూరితమైన భారీ లోహం. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే ముఖ్యంగా పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధిని దెబ్బతీస్తుంది. గర్భధారణ సమయంలో సీసం ప్రభావం గర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టించగలదు. పెద్దలలో కూడా ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన USFDA, ఈ పాత్రలను వెంటనే పారవేయాలని, వాటి అమ్మకాలను ఆపాలని స్పష్టం చేసింది.
నిజం బయటపడిందిలా…
హిండాలియం/ఇండాలియం అనే అల్యూమినియం మిశ్రమ లోహంతో తయారైన వంటపాత్రలు పరీక్షించగా, అవి ఆహారంలోకి సీసం విడుదల చేస్తున్నట్లు USFDA గుర్తించింది. ఈ తరహా వంటపాత్రలు భారతీయ మార్కెట్లలో కూడా విస్తృతంగా లభిస్తున్నాయి.
పాత, కాలం చెల్లిన వంటపాత్రల నుండి కూడా లోహాలు ఆహారంలోకి చేరే ప్రమాదం ఉంది. అందుకే, వంటపాత్రలను ఎంచుకునేటప్పుడు వాటి నాణ్యత, ప్రమాణాలు, తయారీదారు వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం.
ఈ USFDA హెచ్చరిక, కేవలం అమెరికాలోని వినియోగదారులకే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తులు అమ్ముడవుతున్న అన్ని దేశాల వినియోగదారులకు ఒక హెచ్చరికగా నిలిచింది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది.