దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత విషయంలో 2018-19 నుంచి 2022-23 వరకు భారతీయ రైల్వే పనితీరుపై కాగ్ ఒక నివేదిక రెడీ చేసింది. ఈ నివేదికను బుధవారం పార్లమెంటుకు ముందుకు తీసుకువచ్చింది. అయితే ఈ నివేదికలో ప్రజారోగ్యం, భద్రతపై, రైల్వేపనితీరుపై కాగ్ కీలక విషయాలను పేర్కొంది. కేవలం ఒక్క 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ట్రైన్‌లోని టాయిలెట్లు, వాష్ బేసిన్లలో నీరు రాకపోవడంపై భారత రైల్వేలకు మొత్తం 1,00,280 ఫిర్యాదులు వచ్చాయని CAG వెల్లడించింది. అయితే వీటిలో 33,937 కేసులను తక్షణమే పరిష్కరించినట్లు కాగ్ తెలిపింది.
బోగీలలో నీటి సమస్యపై ఆడిట్ చేసిన CAG, బోగీలలో నీటి కొరత గురించి తరచుగా ప్రజల ఫిర్యాదులు రావడంపై విచారణ జరిపింది. ఎంపిక చేసిన స్టేషన్‌లలో ట్రైన్‌లలో నీరు నింపకపోవడం కారణంగానే ఈ సమస్య తలెత్తుతున్నట్లు కాగ్ తన నివేదికలో తెలిపింది. కొన్ని స్టేషన్‌లలో ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్లు ఉన్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో వినియోగంలో లేకపోవడం కూడా ఈ సమస్యలకు కారణమని కాగ్ తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆన్‌బోర్డు హౌస్‌కీపింగ్ సర్వీసులపై మాత్రం ప్రయాణికులు సంతృప్తిగా ఉన్నట్లు కాగ్ తెలిపింది.
సుదూర రైళ్లలో బయో-టాయిలెట్ల శుభ్రతకు సంబంధించి, ఎంపిక చేసిన 96 రైళ్లలో 2,426 మంది ఆన్‌బోర్డ్ ప్రయాణికులతో సమగ్ర సర్వే నిర్వహించినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. ఈ సర్వేలో కేవలం ఐదు జోన్లలో 50 శాతం మంది ప్రయాణికులు మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారని.. మరో రెండు జోన్లలో ఇది 10 శాతం కంటే తక్కువగా ఉందని కాగ్ తెలిపింది.
రైళ్లలో పరిశుభ్రత కార్యకలాపాలకు సంబంధించిన బడ్జెట్, ఖర్చులను కూడా కాగ్ పరిశీలించింది, వాస్తవ ఖర్చులు తుది బడ్జెట్ గ్రాంట్ (FBG) కంటే 100 శాతం (దక్షిణ రైల్వే), 141 శాతం (నార్త్ సెంట్రల్ రైల్వే) మధ్య ఎక్కువగా ఉన్నాయని గుర్తించింది. ఈ సమస్యలు ప్రజారోగ్యం, భద్రతపై ప్రభావం చూపుతున్న కారణంగా.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైళ్లలలో కచ్చితమైన పరిశుభ్రతను పాటించాలని భారతీయ రైల్వేకు కాగ్ సూచించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.