ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజస్థాన్‌లోని కోటా-బుండిలో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1507 కోట్లు నిధులు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి విడుదల చేశారు. కటక్-భువనేశ్వర్ ఆరు లేన్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ. 8307 కోట్ల నిధులు కేటాయించారు. కోటా ఎయిర్‌పోర్ట్‌ను 1507.00 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కోటా రాజస్థాన్‌కు పారిశ్రామిక, విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ కొత్త విమానాశ్రయం కోటా అభివృద్ధికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.
రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే A-321 మోడల్ విమానాల నిర్వహణకు అనువైన 440.06 హెక్టార్ల భూమిని ఏఏఐకి బదిలీ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1000 పీక్ అవర్ ప్యాసింజర్లను నిర్వహించగల సామర్థ్యం గల టెర్మినల్ భవనం నిర్మాణం, ఏటా 20 లక్షల మంది ప్రయాణీకుల సామర్థ్యం , 7 పార్కింగ్ బే లతో కూడిన ఆప్రాన్, రెండు లింక్ టాక్సీవేలు, ఏటీసీ కమ్ టెక్నికల్ బ్లాక్, ఫైర్ స్టేషన్, కార్ పార్క్, అనుబంధ పనులు చేపట్టనున్నారు. ఒడిశాలోని కటక్-భువనేశ్వర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పర్యాటక రంగానికి చాలా ఉపయోగం జరుగుతుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా కీలకమైన గేమింగ్ బిల్లును కేంద్రం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. దీనితో ఆన్లైన్ గేమింగ్ రంగంలో కొత్త మార్పులు రానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..