Tamil Nadu Election: డీఎంకేకు చెక్ పెట్టేందుకు బీజేపీ సరికొత్త వ్యూహం.. అన్నాడీఎంకేతో కలిసి మాస్టర్ ప్లాన్

Tamil Nadu Election: డీఎంకేకు చెక్ పెట్టేందుకు బీజేపీ సరికొత్త వ్యూహం.. అన్నాడీఎంకేతో కలిసి మాస్టర్ ప్లాన్


కౌన్‌ బనేగా నెక్ట్స్ ఉపరాష్ట్రపతి అనే డైలమాకు తనదైన స్టయిల్‌లో ఫుల్‌స్టాప్ పెట్టింది మోదీ మంత్రాంగం. అన్ని కోణాల్లో ఆలోచించి, అన్ని సామాజిక సమీకరణాల్ని వర్కవుట్ చేసి కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది. ఇదే గ్యాప్‌లో పొలిటికల్ ఈక్వేషన్లను బేరీజు వేసుకుని తన్ను తాను శాటిస్‌ఫై చేసుకుంది. ఇందుకోసం బీజేపీ అమలుచేసిన ప్లాన్ ఏంటంటే ‘ఆపరేషన్ కొంగునాడు!’ అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నా అంటూ సడన్‌గా కుర్చీ దిగి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా సమర్పించిన జగదీప్ ధన్‌ఖడ్.. దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ సెన్సేషన్‌కి తావిచ్చారు. తప్పుకున్నారా, తప్పించారా అనే చర్చ ఒకవైపు, ఆయనతో ఖాళీ ఐన వైస్‌ప్రెసిడెంట్ పోస్టును ఎవరితో భర్తీ చేస్తారు అనే చర్చ మరోవైపు రాజకీయ రచ్చను రేపింది. ఆదివారం ప్రధాని మోదీతో పాటు పార్టీ అగ్రనేతలు నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్న బీజేపీ పార్లమెంటరీ బోర్డ్‌ సమావేశం ఓ నిర్ణయం తీసుకుని, ఈ చర్చను మరో మలుపు తిప్పేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు తమిళ బీజేపీ సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ పేరును ఫైనల్ చేశారు.

చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు కాగానే, గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి మహారాష్ట్ర రాజ్‌భవన్‌కు గుడ్‌బై చెప్పేశారు. గతంలో ఆయన 18 నెలల పాటు ఝార్ఖండ్ గవర్నర్‌గా చేశారు. తెలంగాణ, పాండిచ్చేరి ఇన్‌చార్జి గవర్నర్‌గా ఉన్నారు. అంతకుముందు రెండుసార్లు కోయంబత్తూరు ఎంపీగా గెలిచి పార్లమెంటు మెట్లెక్కారు. మూడేళ్ల పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం కూడా ఉంది. అప్పట్లో 93 రోజుల పాటు రథయాత్ర చేసి పార్టీ అధిష్టానం గుడ్‌లుక్స్‌లో పడ్డారు.

కట్‌చేస్తే, మళ్లీ ఇన్నాళ్లకు తమిళనాట రాజకీయ చక్రం తిప్పే బాధ్యతను పరోక్షంగా ఆయనకు కట్టబెట్టింది హైకమాండ్. అదెలాగంటే, ప్రస్తుతం తమిళనాడు కేంద్రంగా పొలిటికల్ ఎక్సర్‌సైజ్ చేస్తోంది బీజేపీ. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా అన్నాడీఎంకేతో కలిసి పావులు కదుపుతోంది. మదురైలో మురుగన్ మానాడు, తర్వాత చోళ రాజేంద్రుడి సహస్రాబ్ది ఉత్సవాల్లో మోదీ పార్టిసిపేషన్.. ఇలా తమిళనాట అన్ని రకాల ఓటుబ్యాంకుల్ని ప్రసన్నం చేసుకుంటోంది బీజేపీ. ఇప్పుడు అటువంటిదే మరో ట్రంప్‌కార్డ్‌ను బైటికి తీసిందా? రాధాక్రిష్ణన్ ఎంపిక వెనుక పెద్ద స్కెచ్చే ఉందా?

తమిళనాడులో దేవర కమ్యూనిటీ తర్వాత అత్యంత బలమైన సామాజికవర్గం గౌండర్లు. ఇప్పుడు వైస్‌ప్రెసిడెంట్‌ కుర్చీకి ఎంపిక చేసిన రాధాకృష్ణన్ గౌండర్ కులస్థుడే. కోయంబత్తూర్, కరూర్, సేలం, ఈరోడ్‌ సహా 8 జిల్లాలు కలిసిన ప్రాంతం పేరే కొంగునాడు. 2 కోట్లకు పైగా జనాభా ఉండే కొంగునాడు పరిధిలో గౌండర్ బలగం ఎక్కువ. 60కి పైగా అసెంబ్లీ సీట్లున్న కొంగుమండలంలో ఇప్పటికే అన్నాడిఎంకే ఆధిపత్యం నడుస్తోంది. గత ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలో 9 అన్నాడిఎంకె, ఒకటి బీజేపీ గెలవడంతో అధికార డీఎంకే సున్నాకే పరిమితమైంది. ఈ ప్రాంతంపై పట్టు కోసం చూస్తున్న బీజేపీ, ఇదే ప్రాంతానికి చెందిన బలమైన గౌండర్‌ నేత రాధాక్రిష్ణన్‌కు ఉపరాష్ట్రపతిగా ప్రమోషన్ ఇచ్చి.. గట్టిగానే పాచిక వేసింది. అన్నాడీఎంకే అధిపతి పళనిస్వామి, బీజేపీ మాజీ ప్రెసిడెంట్ అన్నామలై కూడా గౌండర్ కమ్యూనిటీకి చెందినవారే. టీవీకే పార్టీ దళపతి విజయ్ కూడా ఇదే ప్రాంతం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. సో… రాధాకృష్ణన్‌ను ముందు నిలబెట్టి, ట్రయాంగిల్ ఫైట్‌లో రసవత్తరమైన పోటీనిచ్చి కొంగుమండలంలో అత్యధిక సీట్లు గెల్చుకుని డీఎంకేకి గట్టిగా షాక్ ఇవ్వాలన్నది కమలదండు స్ట్రాటజీ.

ఈనెల 19న ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతిగా కూటమి అభ్యర్థిని ప్రకటిస్తారు. బీజేపీ ఎవరిని ఎంపిక చేసినా మద్దతిస్తామని ఎన్డీఏ పార్టీలు ఇప్పటికే తీర్మానించేశాయి. సో, వైస్‌ప్రెసిడెంట్‌గా రాధాక్రిష్ణన్‌ గెలుపు లాంచనప్రాయమే. సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *