హైదరాబాద్, ఆగస్ట్ 16: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణ ఒడిస్సా, దానికి అనుకొని ఉన్న ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనానికి అనుసంధానంగా సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు రుతుపవణాలు ఊపందుకున్నాయి. వీటి ప్రభావంతో ఈ రోజు (ఆగస్ట్ 16) తెలంగాణ లోని ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
అతి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు శుక్రవారం (ఆగస్ట్ 15) సాయంత్రం నుంచే హైదరాబాద్ జంట నగరాల్లో వాన దంచి కొడుతుంది. రాత్రి 11 గంటల వరకు నగరాన్ని ముంచెత్తింది. కూకట్‌పల్లిలో అత్యధికంగా 6.58 సెం.మీలు, జీడిమెట్లలో 6.08 సెం.మీలు, శంషిగూడలో 5.75 సెం.మీలు, షాపూర్‌నగర్‌లో 5.70 సెం.మీలు, గాజుల రామారంలో 5.63 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.