
రోజువారీ వాడకం వల్ల వంటింటి సింక్ పైపుల పై మురికి పేరుకుపోవడం సర్వసాధారణం. ఈ మురికి క్రమంగా గట్టిపడి, మరకలుగా మారుతుంది. ఆ తర్వాత వాటిని శుభ్రం చేయడం కష్టం. అందుకే వీటిని తరచుగా క్లీన్ చేయడం ముఖ్యం. ఇంట్లో ఉండే కొన్ని సింపుల్ వస్తువులతోనే పైపులను మెరిపించే చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెనిగర్
సమాన పరిమాణంలో నీరు, వెనిగర్ కలిపి ఒక స్ప్రే బాటిల్ లో నింపండి. ఈ మిశ్రమాన్ని పైపుపై స్ప్రే చేసి 15 నిమిషాలు ఉంచండి. తర్వాత మెత్తని బట్టతో తుడిస్తే మరకలు సులభంగా పోతాయి.
మైక్రోఫైబర్ క్లాత్
మైక్రోఫైబర్ బట్టను నీటిలో తడిపి మెల్లగా పిండి పైపును తుడవండి. ఈ బట్ట మురికిని తేలికగా తొలగించడమే కాకుండా.. పైపులకు మంచి మెరుపు ఇస్తుంది.
బేకింగ్ సోడా
కొద్దిగా నీటిలో బేకింగ్ సోడా కలిపి పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్ ను మరకలపై రాసి రుద్దండి. కాసేపు అలా ఉంచి ఆ తర్వాత శుభ్రం చేస్తే మురికి మాయమవుతుంది.
నిమ్మరసం
సగం కట్ చేసిన నిమ్మకాయను నేరుగా మరకలపై రుద్దండి. నిమ్మలోని సహజ ఆమ్లాలు మురికిని తొలగించడంలో సహాయపడతాయి. దీంతో పైపులు శుభ్రం అవ్వడమే కాకుండా.. మంచి సువాసన కూడా వస్తుంది.
బ్రష్‌తో క్లీనింగ్
పాత టూత్ బ్రష్ ను ఉపయోగించి పైపులోని మూలల్లో ఉన్న మురికిని కూడా సులభంగా తొలగించవచ్చు. బ్రష్ తో రుద్దడం వల్ల చేరలేని ప్రదేశాల్లోని మరకలు కూడా పోతాయి. ఈ సింపుల్ చిట్కాలతో మీ కిచెన్ పైపులను ఎల్లప్పుడూ మెరిసేలా ఉంచుకోవచ్చు.