
క్యాన్సర్ రీసెర్చ్ UK, క్యాన్సర్ కౌన్సిల్ ఆస్ట్రేలియా నివేదికల ప్రకారం.. ప్లాస్టిక్ బాటిళ్లతో నీరు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లభ్యంకాలేదు. బిస్ఫినాల్-ఎ (BPA) లేదా ఇతర ప్లాస్టిక్ సమ్మేళనాలు వంటి రసాయనాలు ప్లాస్టిక్ బాటిళ్లలో కనిపించినప్పటికీ, అవి చాలా తక్కువ మొత్తంలో నీటిలోకి లీక్ అవుతాయి. అయితే ఇవి చాలా తక్కువగా ఉండటం వలన శరీరానికి ఎటువంటి హాని జరగదు. అంతే కాదు ప్లాస్టిక్‌ను వేడిచేసినా, స్తంభింపజేసినా క్యాన్సర్ ప్రమాదం వస్తుందనేదానికి కూడా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ప్రస్తుతం జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, వాల్టర్ రీడ్ ఆర్మీ మెడికల్ సెంటర్‌ను ఉటంకిస్తూ ఇలాంటి క్యాన్సర్ పుకార్లు నెట్టింట వ్యాపిస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థలు ఈ వాదనలను ఖండించాయి.
BPAని క్యాన్సర్‌తో తరచూ అనుబంధిస్తుంటారు. నిజానికి బిస్ ఫినాల్-ఎ (BPA) అనేది దశాబ్దాలుగా ప్లాస్టిక్‌లను తయారు చేయడానికి ఉపయోగించబడుతున్న రసాయన సమ్మేళనం. BPA ప్రధానంగా పాలికార్బోనేట్ ప్లాస్టిక్‌లు, ఎపాక్సీ రెసిన్‌లను తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. వీటిని ప్లాస్టిక్ సీసాలు, ఆహార నిల్వ కంటైనర్లు, బేబీ బాటిళ్లు, డబ్బాల్లో ఉన్న ఆహార కంటైనర్లపై లోపలి పూత, థర్మల్ పేపర్ వంటి రోజువారీ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే BPA చాలా తక్కువ మొత్తంలో ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది శరీరంలో త్వరగా విచ్ఛిన్నమై మూత్రం ద్వారా బయటకు పోతుంది. కాబట్టి శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు.
BPA ని ఎండోక్రైన్ డిస్రప్టర్‌గా పరిగణిస్తారు. సరళంగా చెప్పాలంటే ఇది శరీర హార్మోన్ల వ్యవస్థకు హాని తలపెడుతుంది. ఇది ఈస్ట్రోజెన్ వంటి శరీర హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. కొన్ని అధ్యయనాలు BPAకి అధికంగా గురికావడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని సూచించాయి. అంతేకాకుండా BPAకి అధికంగా గురికావడం వల్ల రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నాఉ. కానీ ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలు లభ్యంకాలేదు. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.