Virat Kohli : భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో దేశ సైనికులకు గౌరవం తెలియజేస్తూ ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. కోహ్లీ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కోహ్లీ.. “ఈ రోజు మనం స్వేచ్ఛగా నవ్వుతున్నామంటే దానికి కారణం మన దేశం కోసం నిలబడిన ధైర్యవంతులైన సైనికులే. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన వీరుల త్యాగాలను స్మరించుకుందాం. వారిని గౌరవిద్దాం. భారతీయుడిగా గర్వపడుతున్నాను. జై హింద్” అని రాశారు. ఈ పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంది.
కోహ్లీ చేసిన ఈ పోస్ట్ తన వన్డే క్రికెట్ భవిష్యత్తుపై పెరుగుతున్న ఊహాగానాల మధ్య వచ్చింది. ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీకి వన్డే ఫార్మాట్‌లో చివరిది కావచ్చని, అలాగే 2027 వన్డే ప్రపంచ కప్‌లో అతను ఆడకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెలెక్షన్‌లో ఉండాలంటే కోహ్లీ, రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంటుందని కూడా కొన్ని వర్గాలు నమ్ముతున్నాయి. కోహ్లీ తన ప్రణాళికల గురించి అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ.. 2027 వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీ, రోహిత్ కలిసి ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆగస్టు 15న భారత్ కేవలం ఆరు మ్యాచ్‌లలో మాత్రమే ఆడింది. అందులో ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మెన్ ఈ రోజున సెంచరీ సాధించారు. ఆ ఘనత సాధించిన వ్యక్తి విరాట్ కోహ్లీ. కోహ్లీ తన కెరీర్‌లో 82 సెంచరీలు చేసినప్పటికీ ఈ సెంచరీ చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన కంటే ముందు కానీ, తర్వాత కానీ ఈ రోజున ఎవ్వరూ సెంచరీ చేయలేదు.
Virat Kohli’s Instagram story on India’s independence day. 🇮🇳 pic.twitter.com/GqOUkuBJWF
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2025
ఈ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో నమోదైంది. ఈ మ్యాచ్ ఆగస్టు 14న ప్రారంభమై, వర్షం కారణంగా ఆగస్టు 15 ఉదయం వరకు (భారత కాలమానం ప్రకారం) కొనసాగింది. కోహ్లీ కెప్టెన్‌గా 99 బంతుల్లో 14 ఫోర్లతో 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, మ్యాచ్‌ను భారత్‌కు గెలిపించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..