ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగు రైల్వే ప్రాజెక్ట్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వ్యవసాయ రంగానికి గత పదేళ్లలో 9 లక్షల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు NCDCకి భారీగా నిధులు కేటాయించారు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ..NCDCకి కు రూ.2 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద నాలుగేళ్లపాటు దీన్ని అందిస్తారు. రుణాల కింద మరిన్ని నిధులు సమకూర్చుకోవడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 8.25లక్షలకు పైగా ఉన్న సహకార సంఘాల్లోని 29 కోట్ల మంది సభ్యులకు ఈ కార్పొరేషన్ రుణాలు అందిస్తుంది. వీరిలో 94శాతం మంది రైతులే ఉన్నారు. కేంద్రం అందించే ఈ ఆర్థిక సాయం ద్వారా అదనంగా మరో రూ.20వేల కోట్ల రుణాలను ఎన్‌సీడీసీ సమకూర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్‌సీడీసీ రుణ రికవరీ రేటు 99.8శాతంగా ఉండగా.. సున్నా ఎన్‌పీఏ ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. పీఎం కిసాన్ సంపద యోజనకు రూ.6520 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూపీ లోని ఇటార్సీ నుంచి నాగ్‌పూర్ వరకు కొత్త హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. శంభాజీ నగర్-పర్బనీ మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.