మీరు నిద్రలో తరచూ భయంకరమైన పీడకలలతో మేల్కొంటున్నారా..? అయితే జాగ్రత్త.. అలాంటి కలలు కేవలం మానసిక ఒత్తిడికి గుర్తు మాత్రమే కాదు. అవి మీ శరీరంపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. ఒక కొత్త పరిశోధన ప్రకారం.. ఇలాంటి పీడకలలు శరీరానికి త్వరగా ముసలితనాన్ని తెస్తాయి. అంతేకాదు జీవన కాలాన్ని తగ్గించే అవకాశాన్ని కూడా పెంచుతాయి.
శరీరానికి నిశ్శబ్ద హెచ్చరిక
ప్రతి మనిషి నిద్రలో ఏదో ఒక రకం కలలు చూస్తుంటారు. కొన్ని కలలు హాయిగా ఉంటాయి. మరికొన్ని భయంకరంగా ఉండొచ్చు. కానీ తరచూ కలలు భయంకరంగా ఉంటే.. దాని వెనుక మానసిక సమస్యలు దాగి ఉండే అవకాశం ఉంది. ఇలాంటి కలలు ఒక్కోసారి మన ఆరోగ్య పరిస్థితిని గుర్తు చేస్తాయని నిపుణులు అంటున్నారు.
పీడకలలతో వృద్ధాప్యం
యూరప్‌లో జరిగిన న్యూరాలజీ విభాగానికి చెందిన ఓ కొత్త శాస్త్రీయ సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. తరచూ వచ్చే పీడకలలు, మానసిక ఒత్తిడితో నిద్రలో కలిగే అనుభవాలు.. కణాల్లో వృద్ధాప్యాన్ని వేగంగా పెంచే రసాయన మార్పులకు దారి తీస్తాయని పరిశోధకులు నమ్ముతున్నారు.
జీవిత కాలాన్ని తగ్గించే ప్రమాదం
ఈ అధ్యయనం ప్రకారం.. తరచూ పీడకలలు అనుభవించే వారిలో, మామూలుగా కలలు కనేవారితో పోలిస్తే.. త్వరగా చనిపోయే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉందని తెలిసింది. దీని వల్ల శారీరకంగా మాత్రమే కాదు.. మానసికంగా కూడా తీవ్ర ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది.
జాగ్రత్త అవసరం
ఈ పరిశోధనలో ఒక విషయం స్పష్టమైంది. నిద్రలో మనకు కలల రూపంలో వచ్చే అనుభవాలు కూడా ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్య సమాచారం ఇవ్వగలవు. అందు వల్ల తరచూ భయంకర పీడకలలు వస్తున్నవారైతే.. దీన్ని తేలికగా తీసుకోకుండా డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.