అవిసె గింజల్లోని పోషకాలు స్కాల్ప్ ను పోషించి దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్లు విటమిన్ E, జుట్టును లోపలి నుంచే బలంగా మారుస్తాయి. ఇవి చుండ్రు సమస్యను తగ్గించడంలో కూడా సాయపడతాయి. అవిసె గింజల జెల్ ని తక్కువ వస్తువులతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
అలాగే అలోవెరా జెల్ కూడా జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. చుండ్రును తగ్గించి జుట్టు పెరుగుదలకు సాయపడతాయి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- అవిసె గింజలు – 4 టేబుల్ స్పూన్లు
- నీరు – 2 కప్పులు
- కలబంద జెల్ – 1 టేబుల్ స్పూన్
- విటమిన్ E క్యాప్సూల్స్ – 2
- బాదం నూనె – 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
అవిసె గింజల జెల్ తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న పాన్‌లో రెండు కప్పుల నీటిని తీసుకుని వేడి చేయాలి. నీరు వేడెక్కగానే అందులో అవిసె గింజలు వేసి మధ్యస్థ మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపి దాన్ని చల్లబరచాలి. ఆ తర్వాత ఒక బట్ట లేదా జల్లెడ సహాయంతో వడకట్టి గింజల నుంచి జెల్‌ను వేరు చేసుకోవాలి.
ఈ జెల్ పూర్తిగా చల్లబడిన తర్వాత అందులో కలబంద జెల్, విటమిన్ E క్యాప్సూల్‌లోని ద్రవం, అలాగే బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు నెమ్మదిగా పట్టించాలి. ఇది జుట్టుకు కావాల్సిన పోషణను అందించి ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
ఈ అవిసె గింజల జెల్ ను వారానికి రెండు నుండి మూడు సార్లు వాడితే చుండ్రు తగ్గుతుంది. జుట్టు బలంగా మారి తక్కువ సమయంలోనే మంచి పెరుగుదల కనిపిస్తుంది. మీ జుట్టు సంరక్షణ కోసం ఈ సహజసిద్ధమైన పద్ధతిని ప్రయత్నించండి.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి)