ప్రపంచవ్యాప్తంగా మలయాళీ సమాజ ప్రయోజనాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా వరల్డ్ మలయాళీ కౌన్సిల్ పనిచేస్తోంది. ఇది మలయాళీల ఐక్యత పెంపొందించడంతో పాటు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తోంది. వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఇటీవలే నేపాల్‌లో పర్యటించారు. సంబంధాల బలోపేతంతో పాటు అభివృద్ధి అవకాశాలను అన్వేషించడానికి నేపాల్‌లో పర్యటించారు. గ్లోబల్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు స్టీఫెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని నేపాల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి దామోదర్ భండారిని కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు.
నేపాల్‌లో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ కార్యాకలాపాలకు అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. మలయాళీ ఇన్వెస్టర్లు, వ్యాపారస్థులను ప్రోత్సహిస్తామని చెప్పారు. నేపాల్‌లో డబ్ల్యూఎంసీ వృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుందని గ్లోబల్ వైస్ చైర్మన్ దినేష్ నాయర్ తెలిపారు. కాగా కొత్తగా నియమితులైన సెక్రటరీ జనరల్ షాజీ మాథ్యూ ములమూట్టిల్, వైస్ చైర్మన్ సురేంద్రన్ కన్నట్ వంటి ప్రతినిధి బృందం భారత రాయబార కార్యాలయ అధికారులతో సమావేశమైంది. నేపాల్‌లో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ శాఖ ఏర్పాటుకు చొరవ చూపుతున్న ఫాదర్ రాబీ కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.
బ్యాంకాక్‌లో జరిగిన డబ్ల్యూఎంసీ గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తర్వాత కౌన్సిల్ ప్రతినిధులు నేపాల్‌ను సందర్శించారు. అక్కడ వారు మలయాళీ కమ్యూనిటీ ప్రతినిధులు, భారత రాయబార కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. నేపాల్ ప్రధానితోనూ సమావేశం కానున్నారు. నేపాల్‌లో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ శాఖను ఏర్పాటు చేయడంతో మలయాళీ సంస్కృతిని ప్రోత్సహించడంలో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో ఈ సమావేశాలు ఒక ముఖ్యమైన భాగంగా చెప్పొచ్చు.