టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యుల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 11 వరకు దీనిని పూర్తి చేయాలని నిర్ణయించింది. మొత్తం 10 రోజుల్లో టీచర్ల ప్రమోషన్స్ పూర్తి కానున్నాయి. జూన్ 30 వరకు ఖాళీ అయిన స్థానాలతో భర్తీ చేయనున్నారు. దీనికి ముందే ట్రాన్స్ఫర్స్ చేపట్టాల్సి ఉండగా.. స్కూల్స్ ప్రారంభమవడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. అయితే ప్రమోషన్లు మాత్రం కల్పించాలని నిర్ణయించింది.
కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,900 మందికి పదోన్నతులు లభించనున్నాయి. 900 వరకు ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీంతో 900 మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ లభించనుంది. దీంట్లో మల్టీజోన్-1లో 492, మల్టిజోన్-2లో411 పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్టులు 641వరకు ఖాళీ ఉన్నాయి. వాటిని ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేయనున్నారు. ప్రమోషన్ల వల్ల ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జీటీలతో భర్తీ చేస్తారు. అటు పీఈటీ, లాంగ్వేజ్ పండితులకు సైతం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని రేవంత్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇతరులకు ఇస్తే శాఖను పట్టించుకుంటారో లేదో అనే సందేహాంతో తన వద్దే ఉంచుకున్నట్లు చెప్పారు. అటు పలు పాఠశాలల్లో రెగ్యులర్ హెచ్ఎం లేకపోవడంతో పలు సమస్యలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి