చైనాలోని నైరుతి ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, బురద ప్రవాహాలు భారీ విధ్వంసం సృష్టించాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా… వరద పోటెత్తుతుంది. బురద అకస్మాత్తుగా గ్రామాలలోకి ప్రవేశించింది. దీని కారణంగా అనేక ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా యాన్ , మీషాన్ నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ మీడియా ప్రకారం ఒక గ్రామం మొత్తం వరద ప్రవాహంతో దెబ్బతింది. గ్రామంలో డజన్ల కొద్దీ ఇళ్ళు కూలిపోయాయి. చాలా మంది వరద నీటిలో కొట్టుకుని పోయారు.. ఇప్పటికీ వారి జాడ కనిపించలేదు.
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వందలాది మందిని తరలించారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా బురద, శిథిలాలతో నిండిపోయాయి. దీనివల్ల సహాయ చర్యలు కూడా దెబ్బతింటున్నాయి. కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వ సంస్థలు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తుల కోసం వందలాది మంది రెస్క్యూ వర్కర్లు, సెర్చ్ టీమ్‌లు వెతుకుతున్నాయి. సెర్చ్ డాగ్‌లు, డ్రోన్ల సహాయం కూడా తీసుకుంటున్నారు. రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల వరదలు, బురద ప్రవాహాలు మరింతగా ముంచెత్తే అవకాశం ఉందని చైనా వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ మార్పు, అస్తవ్యస్తమైన నిర్మాణ పనులు ఈ ప్రాంతంలోని భౌగోళిక స్థితిని బలహీనపరిచాయని.. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహాల సంఘటనలు నిరంతరం పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వర్షాకాలంలో చైనా తరచుగా వరదలతో ఇబ్బంది పడుతుంటుంది. అయితే ఈ ఏడాది సిచువాన్‌లో జరిగిన విధ్వంసం పరిపాలన అధికారులను కూడా ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది.
‼️🚨⚡️China: Mudflows destroy homes in Sichuan Province due to severe flooding. pic.twitter.com/IKUPoHOMPu
— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) July 5, 2025
ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం సహాయ చర్యల కోసం ప్రత్యేక నిధిని విడుదల చేసింది. బాధిత ప్రజల పునరావాసం కోసం అవసరమైన అన్ని వనరులను వెంటనే పంపుతామని తెలిపింది. ఈ విధ్వంసానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, వీటిలో మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు జలమయం అయ్యాయి. మాస్కో న్యూస్ విడుదల చేసిన ఒక వీడియోలో వరద తీవ్ర రూపం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని నివారించడానికి పౌరులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలని స్థానిక పరిపాలన అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..