మరదలితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ఒక యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన నారాయణ పేట జిల్లాలో వెలుగు చూసింది. కృష్ణా మండలం చేగుంట గ్రామానికి చెందిన సంగెంబండ బస్సప్ప, తిమ్మవ్వ దంపతులకు మల్లప్ప, భీమ్ రాయ, పరశివ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. తిమ్మవ్వ కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఆ తర్వాత తండ్రి ఎలాగోలా పెద్ద కొడుకు వివాహం జరిపించాడు. ఆ తర్వాత పెద్ద కొడుకు జీవనోపాధికోసం కర్ణాటక వెళ్లి బెంగళూరులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారితో పాటే తండ్రి బస్సప్ప సైతం వెళ్లిపోయాడు. రెండో కుమారుడు భీమ్ రాయ గ్రామంలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మూడో కుమారుడు పరశివ పదవతరగతి పాస్ కాగానే బెంగళూరులో ఉన్న తండ్రి, అన్నల వద్దకు వెళ్లాడు. అక్కడే పరశివ సైతం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే కొన్నాళ్ల క్రితం రెండో అన్న భార్య సునీత చెల్లెలు నిఖితతో పరశివ ప్రేమలో పడ్డాడు. ఈ విషయం అన్న భీమ్ రాయ, వదిన సునీతలకు తెలియదు. వరుసకు పరశివ, నిఖిత బావమరదలు కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని స్వగ్రామంలో ఉన్న అన్న, వదినలకు చెప్పేందుకు బెంగళూరు నుంచి చేగుంటకు వచ్చాడు. అయితే పరశివ, నిఖిత వివాహానికి అన్న, వదినలు ఒప్పుకోలేదు. నిఖితకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే పెళ్లికి అడ్డు చెబుతున్నామని పరశివకు చెప్పారు. మరో అమ్మాయితో వివాహం చేయిస్తామని సర్ధిచెప్పారు. అన్న, వదినలకు ఎదురు చెప్పలేక పరశివ బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యాడు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని దేవసూగుర్ వద్ద కృష్ణ నదీ తీరం వద్దకు చేరుకున్నాడు.
అక్కడ తన మొబైల్ ఫోన్‌లో ‘ మిస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ‘ అంటూ టెక్స్ట్ ను వాట్పప్ స్టేటస్‌లో పెట్టాడు. అలాగే తన మరదలితో ఉన్న మరో వీడియో పెట్టి… ‘ మిస్ యూ మా..’ అంటూ కన్నీటితో ఉన్న ఎమోజీలను జోడించాడు. అనంతరం ఫోన్ స్వీచ్ ఆఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలంగాణలోని కృష్ణ, కర్ణాటక లోని శక్తినగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్థాపం చెంది పరశివ కృష్ణ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడేమోనని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు సహాయంతో నదీలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. రోజులు గడుస్తున్న పరశివ ఆచూకీ లభించకవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నిరవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..