అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను కోతల రాయుడిని అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ పదే పదే ప్రకటించుకుంటున్న ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తామే ఆపామని ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. యుద్ధ సమయంలో విమానాలు కూల్చేశారని చెప్పారు.
ఐదు జెట్‌లు కూలినట్టు తనకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపామని ట్రంప్ అన్నారు. భారత్-పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతుండగా.. ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించామని ట్రంప్ చెప్పారు. ఇరుదేశాలు శక్తివంతమైన అణ్వాయుధ దేశాలు. ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలన్నామని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్-పాక్ మధ్య కాల్పులు ఆగితే, అందుకు క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్, తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్‌తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. యుద్ధాన్ని ఆపింది తానేనని మరోసారి పాత పాటే పాడారు. – భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు ట్రంప్.
అయితే ట్రంప్ వ్యాఖ్యలపై గతంలోనే తీవ్రంగా స్పందించిన భారత ప్రధాని మోదీ, ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చిచెప్పారు.ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకే ఫోన్‌లో చెప్పానని మోదీ స్పష్టం చేశారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. దాంతో, ఈ అంశంపై మరోసారి మాట్లాడిన ట్రంప్.. ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. ఇందులో తన జోక్యమేమీ లేదని.. భారత్-పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మళ్లీ మాట మార్చి పాత పాటే పాడటం పట్ల అంతర్జాతీయంగా ఆబాసుపాలు అవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.