Praggnanandhaa: భారతదేశానికి చెందిన గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ 1 చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్‌ను ఓడించి చరిత్ర సృష్టించాడు. బుధవారం, జూలై 16న లాస్ వెగాస్‌లో జరిగిన ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ రౌండ్ 4లో ప్రజ్ఞానంద ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్నాడు. 19 ఏళ్ల ఈ యువ చెస్ సంచలనం కేవలం 39 ఎత్తుల్లోనే ప్రపంచ నంబర్ 1 ఆటగాడిని ఓడించి, లాస్ వెగాస్‌లో భారత్ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశాడు. గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ఆటను తన కంట్రోల్లోనే ఉంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రజ్ఞానంద 93.9 శాతం యాక్యురసీతో ఆడుతుండగా, కార్ల్సన్ యాక్యురసీ 84.9 శాతంగా నమోదైంది. ఇది ఆయన సాధారణ స్థాయి కంటే తక్కువ. ప్రజ్ఞానంద సాధించిన ఈ విజయం అతని కెరీర్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది. ఇప్పుడు ప్రజ్ఞానంద, మాగ్నస్ కార్ల్సన్‌ను క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ అనే మూడు ప్రధాన ఫార్మాట్‌లలో ఓడించిన అరుదైన ఘనతను సాధించాడు.
మాగ్నస్ కార్ల్సన్‌ను ఓడించిన తర్వాత జరిగిన పోస్ట్-గేమ్ ఇంటర్వ్యూలో రమేష్‌బాబు ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. “నాకు ప్రస్తుతం క్లాసికల్ కంటే ఫ్రీస్టైల్ ఎక్కువగా ఇష్టం” అని తెలిపాడు. ప్రజ్ఞానంద ప్రశాంతమైన స్వరం, నిర్భయత్వం అతన్ని ఈ స్థాయికి చేర్చాయి. అతను ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నాడు. గతంలో భారత గ్రాండ్‌మాస్టర్ డి. గుకేష్ కూడా ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ప్రజ్ఞానంద విజయంపై భారత క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రశంసించారు. “చెస్ లో భారతదేశానికి ఇది మరో గర్వించదగ్గ క్షణం” అని మన్సుఖ్ మాండవియా రాశారు. 19 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్‌లో కేవలం 39 ఎత్తుల్లోనే ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్‌ను ఓడించి తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించారని మంత్రి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..