అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటన తర్వాత ఏ విమానానికి సంబంధించి ఏ చిన్న వార్త విన్న భయం కలుగుతోంది. ముఖ్యంగా నిత్యం విమానాల్లో ప్రయాణించే వారు అయితే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో విమానం గాల్లో ఉండగానే ఇంజన్ ఫెల్యూర్ సమస్యను ఎదుర్కొంది. ఢిల్లీ నుండి గోవాకు వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం దాని రెండు ఇంజిన్లలో ఒకటి విఫలమైనందున పూర్తి అత్యవసర పరిస్థితి మధ్య ముంబైలో ల్యాండ్ అయింది.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 9.42 గంటలకు విమానం ల్యాండ్ అయిందని సమాచారం. పైలట్ రాత్రి 9.25 గంటలకు అలారం మోగించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఢిల్లీ నుండి గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా 6E 6271 విమానంలో సాంకేతిక లోపం గుర్తించారు పైలెట్. “విధానాలను అనుసరించి, విమానాన్ని దారి మళ్లించి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు” అని ఇండిగో ప్రతినిధి తెలిపారు.
ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశామని, విమానం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించే ముందు అవసరమైన తనిఖీలు నిర్వహిస్తామని కూడా ఇండిగో ప్రతినిధి వెల్లడించారు. “ఈ ఊహించని పరిస్థితి కారణంగా మా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. ఇండిగోలో కస్టమర్లు, సిబ్బంది, విమానాల భద్రత అత్యంత ముఖ్యమైనది” అని ఇండిగో ప్రతినిధి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి