Zimbabwe vs South Africa, 1st Match: హరారేలో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌లోని మొదటి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా జింబాబ్వేను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మొదటి మ్యాచ్‌లో మొత్తం 283 పరుగులు నమోదయ్యాయి. ఇందులో 11 సిక్సర్లు, 23 ఫోర్లు ఉన్నాయి. కానీ, ఈ మ్యాచ్‌లో హీరో డెవాల్డ్ బ్రెవిస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను తుఫాన్ బ్యాటింగ్‌తో 25 బంతుల ముందుగానే దక్షిణాఫ్రికాను గెలిపించాడు. డెవాల్డ్ బ్రెవిస్ 17 బంతుల్లో 41 పరుగులతో దుమ్మురేపాడు. ఇందులో అతను 5 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. కాగా, క్రికెట్ ప్రపంచంలో ‘బేబీ ఏబీడీ’గా పేరుగాంచిన యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్, తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు.
మ్యాచ్ పరిస్థితి..
హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా 38 బంతుల్లో 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే 3 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. లుంగీ ఎన్ గిడి, నాండ్రే బర్గర్, న్కాబాయోమ్జి పీటర్ తలో వికెట్ తీశారు.
142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఆరంభం అంత బాగా లేదు. 38 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ల్హువాన్-డ్రే ప్రిటోరియస్ డకౌట్ కాగా, రీజా హెండ్రిక్స్ (11), కెప్టెన్ రస్సీ వాన్ డెర్ డస్సెన్ (16) కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్..
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) తనదైన శైలిలో బ్యాట్ ఝళిపించాడు. కేవలం 17 బంతుల్లోనే 1 ఫోర్, 5 భారీ సిక్సర్లతో 41 పరుగులు చేసి మ్యాచ్‌ను సౌత్ ఆఫ్రికా వైపు మలుపు తిప్పాడు. రూబిన్ హెర్మాన్ (37 బంతుల్లో 45 పరుగులు)తో కలిసి నాలుగో వికెట్‌కు 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముఖ్యంగా, స్పిన్నర్ ర్యాన్ బర్ల్ వేసిన ఒక ఓవర్లో బ్రెవిస్ మూడు వరుస సిక్సర్లు సహా 25 పరుగులు రాబట్టి జింబాబ్వే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు.
బ్రెవిస్ అవుటయ్యే సమయానికి సౌత్ ఆఫ్రికా విజయం దాదాపు ఖాయమైంది. చివరికి, 15.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’..
తన మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్ గెలిపించిన డెవాల్డ్ బ్రెవిస్‌కు అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సందర్భంగా బ్రెవిస్ మాట్లాడుతూ, తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని, దేవుడు తనకిచ్చిన ప్రతిభతోనే తాను బౌండరీలను సులభంగా ఛేదించగలుగుతున్నానని పేర్కొన్నాడు. లక్ష్యం పెద్దది కానందున, తన సహజ సిద్ధమైన ఆటను ఆడటంపైనే దృష్టి సారించానని తెలిపాడు.
గత 12 నెలలుగా దేశవాళీ క్రికెట్లోనూ, ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా బ్రెవిస్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో కూడా తన పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించి, సౌత్ ఆఫ్రికా క్రికెట్‌కు ఒక నూతన ఆశను నింపాడు. భవిష్యత్తులో బ్రెవిస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్లో ఒక స్టార్‌గా ఎదుగుతాడని ఆశిద్దాం.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..