ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బీహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నారు. బీహార్ ఓటర్ల లిస్ట్‌లో అత్యధికంగా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్థులు ఉండడం కలకలం రేపింది. ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల సర్వేపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈసీ చర్యను వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించాయి. అయితే అత్యున్నత న్యాయస్థానం ఈసీ చర్యను సమర్థించింది. ఇది విపక్షాలకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో నితీశ్ కుమార్ సర్కార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. నితీశ్ పాలనలో దేశ నేరాల రాజధానిగా బీహార్ మారిందని విమర్శించారు. నితీశ్ సీఎం కుర్చీని కాపాడుకునే పనిలో ఉంటే.. బీజేపీ మంత్రులు కమీషన్లు దండుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ఓటెయ్యాలని సూచించారు.
బీహార్ లో 11 రోజుల్లో 31 హత్యలు జరగడం.. అక్కడి శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ విమర్శించారు. ‘‘బీహార్.. దేశ నేర రాజధానిగా మారింది. రాష్ట్రంలోని ప్రతి గల్లీలో భయం, ప్రతి ఇంట్లో అశాంతి నెలకొంది. నిరుద్యోగ యువతను ‘గుండా రాజ్’ హంతకులుగా మారుస్తోంది. సీఎం తన సీటును కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారు. బీజేపీ మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఈసారి ఓటు ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు.. బీహార్‌ను కాపాడటానికి అని ప్రజలు గుర్తుంచుకోవాలి’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ నెల మొదట్లో.. ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను పాట్నాలోని తన నివాసం బయట కాల్చి చంపిన తర్వాత శాంత్రిభద్రతల విషయంలో రాహుల్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..